– తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత
– ఏ తప్పూ చేయలేదన్న నేత
– అప్రూవర్‌గా మారనని స్పష్టీకరణ
– కడిగిన ముత్యంలా తిరిగొస్తా
MLC Kavitha Not bail, Only Jail: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్యే కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, కుమారుడి పరీక్షల నేపథ్యంలో తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కవిత తరపు పిటిషనర్ కోర్టును కోరగా, కవితను జ్యూడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు.
విచారణకు కవిత సహకరించడం లేదని, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకువెళ్లారు. కేజ్రీవాల్, కవితను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని, అందుకే మరో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎమ్మెల్సీ కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. కుమారుడి పరీక్షల కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్ మీద ఏప్రిల్ 1న విచారణ జరుపుతామని న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో విచారణ అధికారులు అమెను తీహార్ జైలుకు తరలించారు.
Read More: కల్వకుర్తికి మహర్దశ..
కడిగిన ముత్యంలా వస్తా
మంగళవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చిన సందర్భంగా కవిత మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదు గనుక అప్రూవర్‌గా మారే ప్రసక్తే లేదనీ, ఇది మనీలాండరింగ్ కేసు కాదనీ, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసనీ అన్నారు. తనను అక్రమంగా నిర్బంధించినా భయపడేది లేదని, తాను ధైర్యంగా విచారణను ఎదర్కొని, కడిగిన ముత్యంలా బయటికొస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసులోని నిందితుల్లో ఒకరు బీజేపీలో చేరగా, మరో నిందితుడు ఏకంగా ఎంపీ టికెట్ పొందారని, మూడో నిందితుడు ఆ పార్టీకి రూ. 50 కోట్ల విరాళాలిచ్చాడని ఆమె సెటైర్లు వేశారు.