- కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ
- ఈడీ అరెస్ట్ అక్రమమన్న లాయర్
- ప్రతివాదులకు నోటీసులు
- కానీ, బెయిల్ కుదరదన్న ధర్మాసనం
- ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశం
- బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
MLC Kavita backlash in liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చిక్కులు తప్పడం లేదు. ప్రస్తుతం ఏం చేసినా రివర్స్ అవుతోంది. తన అరెస్ట్ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవితకు తాజాగా చుక్కెదురైంది. వెంటనే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది న్యాయస్థానం. ట్రయల్ కోర్టును సంప్రదించాలని ఆదేశించింది. ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేయగా, దానిపై విచారణ జరిగింది. జస్టిస్ స్ంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
కవిత తరఫున కపిల్ సిబల్, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈడీ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. కవితను ఒకసారి సాక్షిగా, ఇంకోసారి నిందితురాలిగా పిలిచారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బలమైన సాక్ష్యంలేకుండానే దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగుతోందని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. 6 వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని, మరో 2 వారాల్లో రీజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కవిత ప్రస్తావించిన రాజ్యాంగపరమైన అంశాలపై మాత్రమే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
Read More: కవిత అరెస్టుపై సుఖేష్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు
అలాగే, బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కోరడంపై స్పందించింది న్యాయస్థానం. బెయిల్ కోసం ప్రయత్నాలు ట్రయల్ కోర్టు నుంచే ప్రారంభం కావాలని తెలిపింది. బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు ఆదేశించింది. ఈ వ్యవహారం మినహా మిగతా అంశాలపై విచారణ జరుపుతామని తెలిపింది సుప్రీంకోర్టు. వెంటనే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. లిక్కర్ కేసులో ఈనెల 15న కవిత అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఆమె ఇంట్లో సోదాలు జరిపింది. తర్వాత అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లింది. ఆ రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉంచిన అధికారులు తర్వాతి రోజు ఉదయం వైద్య పరీక్షలు చేయించి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 23 వరకు కస్టడీ విధించింది. అయితే, ఈ అరెస్ట్‌ను కవిత సుప్రీంలో సవాల్ చేశారు. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై విచారించిన న్యాయస్థానం, బెయిల్ అంశాన్ని ట్రయల్ కోర్టులో చూసుకోమని చెప్పింది.