– ఉత్సాహంగా ఓటేసిన పట్టభద్రులు
– సాయంత్రం 4 గంటలకు 69% పోలింగ్
– జూన్ 5న ఓట్ల లెక్కింపు
– గెలుపు అంచనాల్లో పార్టీలు
Poll Percentage: ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం జరిగిన ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. చివరి నిమిషం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అందరికీ అధికారులు ఓటువేసే అవకాశం కల్పించారు. సోమవారం పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 69 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు గంటల తర్వాత కూడా పెద్ద సంఖ్యలో పట్టభద్రులు క్యూలో వేచి ఉండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
గతంలో పల్లారాజేశ్వర్ రెడ్డి ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలవటంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. జూన్ 5వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చింతపండు నవీన్, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అభ్యర్థులుగా బరిలో నిలవగా, వీరి విజయం కోసం ఆయా పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు.
మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలోని పట్టభద్రులు సోమవారం ఉత్సాహంగా ఈ ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉపఎన్నిక కోసం మొత్తం 605 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ మూడు జిల్లాల పరిధిలో 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,73,406 మంది ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా 1,23,985 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది పట్టభద్రులకు ఓట్లు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తారు. పోలింగ్ బూత్‌ల వద్ద అధికారులు 144 సెక్షన్ విధించారు. పోలింగ్ ముగియడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నారు. ఈ ఓట్లు లెక్కింపు జూన్ 5న జరగనుంది. అప్పుడు కూడా మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తారు.