– మరోసారి వార్తల్లో హెచ్‌సీఐ
– ఐపీఎల్ టికెట్ల అమ్మకాలపై రగడ
– క్షణాల్లోనే 45 వేల టికెట్ల ఆన్ లైన్ సేల్స్
– హెచ్‌సీఐ తీరుపై జోరందుకున్న డౌట్స్
– ఎమ్మెల్యే దానం సంచలన కామెంట్స్
ప్రజెంట్ దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ తమ అభిమాన జట్టు కోసం ఎక్కడ మ్యాచులు ఉంటే అక్కడ వాలిపోతున్నారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం చెన్నై, హైదరాబాద్ తలపడ్డాయి. అయితే, మ్యాచ్‌కు ముందు కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే హెచ్‌సీఐ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బ్లాక్ టికెట్ల అమ్మకాలు
చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ అంటే ఫుల్ క్రేజ్ ఉంటుంది. అదికూడా సొంత గ్రౌండ్‌లో అయితే ఫుల్ కిక్కు. దీన్ని హెచ్‌సీఐ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. టికెట్లతోపాటు కాంప్లిమెంటరీ పాసులను కూడా బ్లాక్ అమ్ముకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. 15 ఎకరాల్లో ఉన్న ఉప్పల్ స్టేడియంలో 55వేల మంది దాకా మ్యాచ్ చూడొచ్చు. అయితే, భారీగా బ్లాక్ టికెట్ల దందా నడిపించారనే టాక్ వినిపిస్తోంది. రూ.15 వందల టికెట్‌ను రూ.5 వేలు, రూ.4వేల టికెట్ రూ.9 వేలు, రూ.6 వేల టికెట్ రూ.12 వేల చొప్పున బ్లాక్‌లో అమ్మేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
దానం సంచలన కామెంట్స్
హైదరాబాద్‌లో మ్యాచ్ అంటే టికెట్ల దందా సర్వసాధారణం అయిపోయిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తాను డీఎన్ఆర్ అకాడమీని నడుపుతున్నానని, బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసినట్టు చెప్పిన ఆయన, ఆ హోదాతోనే ఈ అంశంపై మాట్లాడుతున్నట్టు చెప్పారు. హెచ్‌సీఐ కాంప్లిమెంటరీ పాస్ బ్లాక్‌లో అమ్ముకోవడం దారుణమన్నారు. 10 నిమిషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు. హెచ్‌సీఐపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. అలాగే, సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం ఫోకస్ చేస్తారా?
గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిని బయటపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా పాలన కొనసాగిస్తామని చెప్తున్నారు. ఎక్కడా అవినీతి, అక్రమాలు ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టికెట్ల దందాపై ఆయన ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ ఈ అంశంపై రేవంత్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పగా, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా దీనిపై స్పందించారు. ఐపీఎల్ టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
పవర్ కట్ పంచాయితీ
ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్ కావడం కూడా చర్చనీయాంశమైంది. రూ.1.67 కోట్ల బిల్లు పెండింగ్ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. పెండింగ్ బిల్లులపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని, ఈ క్రమంలోనే పవర్ బంద్ చేశామని వారు చెప్పారు. జనరేటర్లతోనే చెన్నై, హైదరాబాద్ క్రికెటర్లు ప్రాక్రీస్ చేశారు. ఇక్కడ ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. విద్యుత్ శాఖ అధికారులు అడిగినన్ని పాసులు ఇవ్వకపోవడంతోనే పవర్ కట్ చేశారని హెచ్‌సీఐ వర్గాల సమాచారం. చివరకు చర్చల తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు అధికారులు.