Minorities: దేశంలో ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పర్వం కొనసాగుతోంది. నిన్నటితో మూడవ దశ పోలింగ్ పూర్తి కాగా, మే 13న నాలుగవ దశ పోలింగ్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. మే 13 సాయంత్రానికి మొత్తం లోక్‌సభ స్థానాల్లో 70 శాతం సీట్లకు పోలింగ్ ముగిసినట్లవుతుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ తమకు అండగా నిలిచే వర్గాలేమిటనే విషయాన్ని ఆరా తీసే పనిలో పడుతున్నాయి. మరీ ముఖ్యంగా పలుచోట్ల విజయావకాశాలను ప్రభావితం చేసే 14 శాతం ముస్లిం మైనారిటీలు ఎటు మొగ్గనున్నారనే విషయంపై ఆయా పార్టీల్లో అంతర్గత చర్చ సాగుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుంచే ముస్లింలను ఆయా పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయనే వాదన ఆ వర్గాలలో ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. తొలి నలభై ఏళ్ల పాటు దేశంలోని ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీనే తమ ఏకైక ప్రతినిధిగా భావించారు. 1989 తర్వాత తెరమీదికి వచ్చిన మండల్ కమిషన్ అంశంతో దేశంలో ముస్లింల ఓటు బ్యాంకు అనేక పార్టీల మధ్య చెదిరిపోయింది. ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం, కాన్షీరాం బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీని, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీల రాకతో ముస్లింల ఓటు బ్యాంకు ఆయా పార్టీలకు మారుతూ వచ్చింది. దశాబ్దాలుగా తమను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ చూసిందనే భావనతో బాటు రాజ్యాధికారంలో తమ వాటాను పెంచుకోవాలనే ముస్లిం వర్గాల ఆకాంక్ష కూడా దీనికి తోడైంది.
అయితే, మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా బీజేపీ అయోధ్య అంశాన్ని తెరమీదికి తేవటం, ఆ తర్వాత జరిగిన కరసేవ బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీయటం, ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో ఉండటం ముస్లిం వర్గాల్లో కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరగడానికి దోహదపడింది. అయితే, అదే సమయంలో బీజేపీని ఢీకొట్టగల, లౌకిక పునాదులున్న ప్రత్యామ్యాయ పార్టీ కాంగ్రెస్ మాత్రమేననే ఎరుక వారిలో ఉండటంతో మెజారిటీ వర్గాలు కాంగ్రెస్‌ను ఆశ్రయిస్తూనే వచ్చాయి. అయితే, దేశవ్యాప్తంగా ముస్లింల మద్దతు పొందుతున్న పార్టీలను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ, హిందూ ఓటర్ల ఏకీకరణ దిశగా అడుగులు వేస్తూ వచ్చింది. 1971లో 70% ముస్లిం ఓట్లను పొందిన కాంగ్రెస్ పార్టీ, 1971-1996 మధ్య 67 శాతానికి పరిమితమైంది. 1996 – 2019 మధ్య కాలంలో కాంగ్రెస్‌కు ముస్లింల మద్దతు మరింత తగ్గుతూ వచ్చింది. 1996 – 98 మధ్య 40 శాతం ముస్లింలు హస్తానికి మద్దతుగా నిలవగా, 2019 నాటికి అది 33 శాతానికి పరిమితమైంది. ఎనభైయ్యవ దశకంలో వచ్చిన తెలుగుదేశం, బీఎస్పీ, జనతాదళ్, 90వ దశకం నాటి ఆర్జేడీ, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు తోడు తర్వాత తెలంగాణ సాధన కోసం పుట్టిన బీఆర్ఎస్, అవినీతి పోరాటం నుంచి పుట్టిన కేజ్రీవాల్ ఆప్ పార్టీ వంటి అనేక పార్టీల వల్ల హస్తానికి పడుతున్న ముస్లింల ఓటు ఇతర లౌకిక పార్టీలకు తరలిపోయింది.
Also Read: ‘కూలి’న బతుకులు
హిందుత్వ ఎజెండాతో తెరమీదకు వచ్చిన బీజేపీ పదేపదే కాంగ్రెస్ పార్టీని ముస్లింలకు అనుకూల పార్టీగా చిత్రీకరించటంతో దేశంలోని ముస్లింలకు ఏదో గొప్ప మేలు జరిగిందనే భ్రమ దేశంలో నెలకొంది. ఈ సమయంలో 2004లో యూపీయే ప్రభుత్వం నియమించిన సచార్ కమిటీ, దేశంలోని ముస్లింల వాస్తవిక స్థితిని కళ్లకు కట్టినట్లు వివరించింది. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ముస్లింలు ఎంతో వెనకబడే ఉన్నారనే వాస్తవం బయటకి వచ్చిన తర్వాత, ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్న స్థానాల్లో ఏదో ఒక పార్టీకి మద్దతు తెలిపే బదులు, తామే ఎందుకు పోటీచేయరాదనే ఆలోచన ముస్లిం వర్గాల్లో మొదలైంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది. 2019లో అక్కడి ముస్లింలలో 61 శాతం మంది సమాజ్ వాదీ పార్టీకే ఓటేయగా, 18 శాతం మంది మాయావతి పార్టీ వైపు మొగ్గారు. దీంతో అక్కడ కాంగ్రెస్‌కు అక్కడ 12 శాతం మైనారిటీ ఓట్లే దక్కాయి. అటు.. ముస్లింలు అధికంగా ఉన్న అసోం, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. బెంగాల్‌లో ముస్లిం ఓట్లను మమతా బెనర్టీ రాబట్టుకోగా, బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ పార్జీలు చేజిక్కించుకున్నాయి. దీనికి భిన్నంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్రధాన పార్టీలే బరిలో నిలిచే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, హర్యాణా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నేటికీ కాంగ్రెస్‌కు 77శాతం ముస్లింల మద్దతు లభిస్తోంది. ఇక్కడ ఆయా నియోజక వర్గాల్లోని నేతలు, పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమ పథకాల కారణంగా బీజేపీకి 18 శాతం ఓట్లు పడుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 9 శాతం లోపే ముస్లింల ఓట్లుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి చెక్ పెట్టేందుకు.. సాఫ్ట్ హిందుత్వ ప్లాన్‌ను అమలు చేస్తోంది. కానీ, 14 శాతం ముస్లిం ఓట్లున్న తెలంగాణలో మైనారిటీ డిక్లరేషన్‌ను ప్రకటించి, బ్రహ్మాండమైన విజయాన్ని అందుకోగలిగింది.
ఇక, మన దేశంలో ముస్లింలు బీజేపీ చెబుతున్నట్లుగా గొప్ప స్థితిలో ఏమీ లేరని 2005లో ఏర్పాటైన రాజేందర్ సచార్ కమిటీ నివేదికను బట్టి తెలుస్తోంది. ఈ నివేదిక హిందూ, ముస్లింలకు గణనీయమైన తేడాలను బయటపెట్టింది. ఇతర అన్ని మతస్తుల కంటే తక్కువగా (83 శాతం) ముస్లింలు భూమిని కలిగి ఉన్నారని వెల్లడించింది. 2001 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలలో అక్షరాస్యత కేవలం 59.1 శాతం మాత్రమేనని, ఇది భారత్‌లోని మరే ఇతర సామాజిక గ్రూపుతోకన్నా తక్కువనీ తేల్చింది. 6-14 ఏళ్ల వయసున్న 25 శాతం ముస్లిం పిల్లలు స్కూలు ముఖమైనా చూడటం లేదనీ, దేశంలోని పేరున్న కాలేజీల్లో కేవలం 2 శాతం ముస్లింలే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకుంటున్నారని వెల్లడించింది. దేశ జనాభాలో ముస్లింలు 13.4 శాతం ఉండగా, ఐఏఎస్‌లలో వారి శాతం కేవలం 3, విదేశీ సేవలో 1.8, ఐపీఎస్ అధికారుల్లో వారి శాతం 4 కన్నా తక్కువేనని నిర్ధారించింది. పట్టణ, నగర ప్రాంతాల్లో జీవించే ముస్లింలు చదువులేని కారణంగా తక్కువ స్థాయి ఉద్యోగాలతోనే జీవితాలను కొనసాగిస్తున్నారని సచార్ కమిటీ తెలిపింది. కానీ, బీజేపీ ముస్లిం దుస్థితి గురించి ఎక్కడ పల్లెత్తు మాట మాట్లాడటం లేదు.
ఇక, తాజా లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే, 2019తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింల ఓటింగు సరళి భిన్నంగా సాగుతోదంనే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ – బీజేపీ ముఖాముఖి పోరు చేస్తున్న గుజరాత్, ఉత్తరాఖండ్, అసోం, కర్ణాటక, ఒడిసా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ వైపే మైనారిటీలు నిలబడినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు కలసి పోటీ చేయటంతో ముస్లింల మద్దతు ఏకపక్షంగా ఈ రెండు పార్టీలకు దక్కనుంది. దేశవ్యాప్తంగా ముస్లింలు 30 శాతానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్న నియోజక వర్గాలు 65 ఉండగా, వాటిలో 29 సీట్లు ఉత్తర ప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఇక బీహార్‌లో బీజేపీతో చేయి కలిపిన నితీష్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఆర్జేడీ- కాంగ్రెస్, వామపక్షాల కూటమికే ఈసారి ముస్లింలు మద్దతుగా నిలుస్తున్నారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సగం మంది ముస్లింలే కాంగ్రెస్‌కు అండగా నిలవగా, ఈ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ హస్తానికే దక్కనున్నాయి. కేరళలో తాజాగా ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ కూటమికి మళ్లారని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ కూటమే గెలవనుందని క్షేత్రస్థాయి నివేదికలు వెల్లడిస్తున్నాయి. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాల కూటమి, జార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి, మహారాష్ట్రలో ఎన్సీపీ,కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్) వైపు ముస్లిం ఓటర్లు మొగ్గారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పట్ణణ ప్రాంత ముస్లిం ఓటర్లు జగన్ వైపు, గ్రామీణ ముస్లిం ఓటర్లు కూటమి వైపు మళ్లే అవకాశాలున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
Also Read: మోదీ ‘కిసాన్’దుకాణ్ బంద్ ?
మమతా బెనర్జీ ఒంటెత్తు పోకడలు పోకుండా ఇండియా కూటమిలో చేరి ఉంటే పశ్చిమ బెంగాల్‌లోని 42 సీట్లలో మెజారిటీ సీట్లు కూటమికే దక్కి ఉండేవని, దీనివల్ల ఇండియా కూటమికి లోక్‌సభలో మరింత ప్రాతినిధ్యం పెరిగేదనే అభిప్రాయమూ వినిపిస్తోంది. మొత్తంగా చూసినప్పడు కాంగ్రెస్ నేతృత్వంలో అనేక పార్టీలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడి ప్రధానంగా ముస్లిం ఓట్లు చీలకుండా బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు చేసిన ప్రయత్నాలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో సఫలం అయ్యాయనే చెప్పవచ్చు. ఈ ఒక్క సమీకరణం ఫలితంగానే, దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ఓటు బ్యాంకు పెరగటమే గాక 40 స్థానాలు అధికంగా లభించే అవకాశం ఉంది. మొత్తంగా చూసినప్పుడు బీజేపీ చెబుతున్నట్లుగా 400 సీట్లు అనేది కల్ల అని, ఆ సంఖ్యకు చాలా దూరంలోనే బీజేపీ ఆగిపోబోతోందనే అభిప్రాయం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆయా దశల పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. మొత్తంగా ఈ 18వ లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు ఎటు మొగ్గారనే వాస్తవం జూన్ 4న విడుదలయ్యే లోక్‌సభ ఫలితాలు వస్తే గానీ తెలియదు.
సదాశివరావు ఇక్కుర్తి
సీనియర్ జర్నలిస్ట్