Neelam Madhu: భారత దేశంలో మెతుకు సీమకు అరుదైన చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీని ఇక్కడి నుంచి గెలిపించారు. ఇందిరా గాంధీ మెదక్ లోక్ సభ స్థానం నుంచి గెలిచి దేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. మళ్లీ 25 ఏళ్ల తర్వాత మెదక్ ప్రజలకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత వచ్చిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మెదక్ లోక్ సభ నుంచి నీలం మధును గెలిపించి.. తద్వార రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి దోహదపడాలని విజ్ఞప్తి చేశారు.
మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు లోక్ సభ ఎన్నికల బరిలో దిగారు. నీలం మధు నామినేషన్ ర్యాలీ శనివారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ ర్యాలీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరై మాట్లాడారు.
మీకు నైతిక హక్కు లేదు
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని కేసీఆర్, హరీశ్ రావులు అంటున్నారని, తాము చేసింది అందరికీ కనిపిస్తూనే ఉన్నదని మంత్రి కొండా సురేఖ అన్నారు. తొమ్మిదేళ్లలో మీరు చేయని పనులను కాంగ్రెస్ చేసి చూపించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మీకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నదని, మోడీని గద్దె దింపాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
వాతపెట్టిన మారడం లేదు
దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను అర్పించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రెండు సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ.. తప్పుకున్నారని, మన్మోహన్ సింగ్‌కు అవకాశం ఇచ్చారని వివరించారు. ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఇందుకోసం మెదక్ నుంచి నీలం మధును కాంగ్రెస్ ఎంపీగా గెలిపించాలని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపినా కేసీఆర్‌కు ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా మారడం లేదని మండిపడ్డారు. ఇంకా తానే సీఎం అన్నట్టుగా కేసీఆర్ వెర్రివాగుడు వాగుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోతారని ప్రగల్భాలు పలుకుతున్నారని, అసలు కేసీఆర్ దగ్గర ఏముందని వస్తారని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీలో చేరుతారని ఆరోపించారు.
ఇందిరాను గెలిపించిన చరిత్ర
మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీని గెలిపించిన చరిత్ర మెదక్ ప్రజలదేనని వివరించారు. ఆ తర్వాత ఆమె దేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారని తెలిపారు. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో నాలుగింటిని ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిశాక.. మిగిలిన రెండింటిని కూడా అమలు చేస్తామని తెలిపారు. అలాగే.. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఐదు గ్యారంటీలను ప్రకటించిందని గుర్తు చేశారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు.