Minister Seethakka Fire On Brs MLC Kavitha: తెలంగాణలోని పేద, మధ్యతరగతి వర్గాల మహిళలను లక్షాధికారులను చేసేందుకు రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కేంపస్‌లో రూ.68 కోట్ల విలువైన పనులకు మరోమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలసి ఆమె శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తోందని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు మహిళలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తోందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అనవసరంగా నోరుపారేసుకుంటున్నారని ఆమె మండి పడ్డారు. గులాబీ పార్టీ మూడోసారి గెలిస్తే, సీఎం కావాలని ఆమె కలలు కన్నారని ఎద్దేవా చేశారు. మహిళలను కాంగ్రెస్ నుంచి దూరం చేసేలా కవిత మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవో నంబర్ 3కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కవిత.. ఆ జీవో తెచ్చింది తన తండ్రి కేసీఆరేనని తెలుసుకోవాలన్నారు. గులాబీ పార్టీ తప్పుడు ప్రచారం మానుకుని, బాధ్యతగల విపక్షంగా పనిచేయాలి’ అని సీతక్క తెలిపారు.
విద్య, వైద్యానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేయూ భూమి కబ్జాకు గురికాకుండా ప్రహరీ నిర్మిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను విస్మరించిందని, కానీ, తాము అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చినట్లు తెలిపారు.మరో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు.