Ponnam Prabhakar: కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. సుమారు దశాబ్దకాలంగా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై అలసత్వం వహించింది. తాజాగా, ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. భవిష్యత్‌లో రూ. 4,000 కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని, అలాగే నూతన రేషన్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతామని వివరించారు. మేడే సందర్భంగా సిరిసిల్లలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద డీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఆవిష్కరించారు. అనంతరం, పాత బస్టాండ్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో పొన్నం మాట్లాడారు.
కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నామని, రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. 200 యూనిట్లలోపు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. రూ. 10 లక్షల ఆరోగ్య శ్రీ ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులకు సంబంధించి అనేక ప్రయోజనాలను తమ ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు.
Also Read: మండుతున్న భా‘స్వరం’
భవిష్యత్‌లో రూ. 4,000 పింఛన్ ఇస్తామని, కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి పొన్నం చెప్పారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, 30 సంవత్సరాల తర్వాత మెజార్టీతో అధికారంలోకి వచ్చి బీజేపీ ఏం చేసింది? అని నిలదీశారు. ఇప్పుడు 400 సీట్లు అడుగుతున్నారని, ఇది రిజర్వేషన్లు తొలగించడానికేనని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆలోచన చేయాలని వివరించారు. బీజేపీని ఉత్తరభారతంలో వ్యతిరేకిస్తున్నారని, ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు ఆలోచన చేయాలని సూచించారు. బీజేపీ మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా పని చేసిందని, ఇప్పుడు బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా తేలడానికి అవసరమైన కుల గణన చేస్తుంటే దాన్ని వ్యతిరేకించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని మండిపడ్డారు.
కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి రాజేందర్ రావును గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాబట్టి, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయాలని కోరారు. పసిఫిక్ మహా సముద్రంలో ఎల్ నినో పోతుందని, లానినో వస్తుందని, కాబట్టి, ఈ సారి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆశాభావంగా చెప్పారు.