– బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్టే
– దేశంలో సంకీర్ణ సర్కార్ రావడం పక్కా
– కేసీఆర్, కేటీఆర్ మానసిక పరిస్థితి దిగజారింది
– రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌ను గద్దె దించాం
– ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారిన బీజేపీని కూడా ఓడిద్దాం
– ప్రజలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపు
Komatireddy Venkatreddy: రాష్ట్రంలో నీటి కరువుకు బీఆర్ఎస్ పార్టీయే కారణమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ పట్టణంలో నియోజకవర్గ బూత్ స్థాయి, ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కోమటిరెడ్డితోపాటు పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ మోసాన్ని గ్రహించి కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్‌కు స్వాగతం పలుకుతున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో రెండు వందల ఎకరాల్లో పది వేల ఇల్లు కడతామని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ మానసిక పరిస్థితి దిగజారిందన్నారు.
‘‘బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్టే. భారత్ జోడో యాత్ర ద్వారా దేశానికి కనువిప్పు కల్పించిన నేత రాహుల్. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. రాహుల్ ప్రధాని అవుతున్నారు. పదేళ్లలో లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను ఓడించాం. కేంద్రంలో బీజేపీని ఓడించాలి. ఆగస్ట్ 15 లోపు రైతు రుణమాఫీ చేయకపోతే దేనికైనా సిద్ధమే. అగ్గిపెట్టె రావు మరోసారి మోసం చేసేందుకు వస్తుండు. వలంటీర్ వ్యవస్థతో ప్రజలకు మరింత దగ్గర అవుతాం. పార్టీలో నాయకులందరికీ సముచిత గౌరవం ఉంటుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా మూడు నెలల్లో పనులు మొదలు పెట్టుకుంటున్నాం. కంట్రోల్ రూమ్ వ్యవస్థతో ప్రజలకు మరింత సేవ చేస్తాం. పోలీసులు, కేసులకు భయపడేది లేదు. మోదీ మన లెక్కలోనే లేడు’’ అంటూ విమర్శలు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Also Read: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచిన ఈసీ
ఇక, జానారెడ్డి మాట్లాడుతూ, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు బీఆర్ఎస్ హయాంలో 18 సార్లు పంటలకు నీళ్లు వదిలిన మాట అవాస్తవమన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని, ఆరు గ్యారెంటీల అమలుకు తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారం మరువలేనిదని అన్నారు. కేసీఆర్‌ను పక్కకు జరిపినట్టే, మోదీని కూడా దించాల్సిన అవసరం ఉందని చెప్పారు.