Bandi Sanjay latest news(TS politics): కాంగ్రెస్ పై కామెంట్లు పేల్చిన బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఘర్షణలు పెట్టి లబ్దిపొందాలను చూస్తున్నదని ఎటాక్ చేశారు. కుల, మతాల మధ్య ఘర్షణలు పెట్టి ఓట్లు దండుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు. తమ పార్టీ అంతర్గత విషయాలను ఏలేటి మాట్లాడకపోవడం మంచిదని సుతిమెత్తగా హెచ్చరించారు. అసలు బండి సంజయ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి తెలుసా? అని ఎదురుదాడికి దిగారు.
నల్లగొండలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్దిపొందాలని చూస్తున్నదని అన్నారు. ఈ ఎన్నికలు దేశ ఐక్యతకు నిదర్శనం అని, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవని, ఏక్ నాథ్ షిండేలూ లేరని స్పష్టం చేశారు. తామంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని తెలిపారు. అసలు ఏక్‌నాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ అని పేర్కొన్నారు.
Also Read: జైలులో కవిత మానసికంగా కుంగిపోతున్నారా? స్టేజ్ 3లో ఉన్నారా?
ఏలేటి మహేశ్వర్ రెడ్డితోపాటు హరీశ్ రావుకు కూడా మంత్రి వెంకట్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని అన్నారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకోబోదని చెప్పారు. గులాబీ పార్టీ ఒక్క సీటు గెలుచుకున్నా దేనికంటే దానికి సిద్ధం అని పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించిన విషయం తెలిసిందే. బండి సంజయ్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో దాడికి దిగిన తరుణంలో ఈ పరిణామం జరిగింది. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో ఉన్నాయని, ఈ రెండు పరోక్షంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకునే పద్ధతిలో ఎన్నికల్లో దిగుతున్నారని ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ చెబితేనే బీజేపీ అధిష్టానం బండి సంజయ్ పై వేటు వేసిందనీ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు బండి సంజయ్‌ను బీజేపీ ఎందుకు రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించిందో తెలుసా? అని ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.