– చచ్చీ చెడీ గెలిచినోడూ లీడరేనా?
– నల్గొండ, భువనగిరిలో కాంగ్రెస్‌దే విజయం
Minister Komatireddy Venkat Reddy Fires On Jagadish Reddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అందరికీ తెలుసు. తాజాగా మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగదీష్‌రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. భువనగిరి, నల్లగొండ సీట్లతో బాటు తెలంగాణలో మొత్తం 14 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోబోతోందని ఆయన జోస్యం చెప్పారు. మాజీమంత్రి జగదీష్ రెడ్డి మీద సెటైర్లు వేశారు. మూడు సార్లు మూడు,నాలుగు వేలతో గెలిచినోడూ లీడరేనా అంటూ ఎద్దేవా చేశారు. మిర్యాలగూడలో జగదీష్ రెడ్డి అక్రమంగా మద్యం అమ్మిన కేసు ఇంకా నడుస్తూనే ఉందనీ, మూడు మర్డర్ కేసుల్లో ఆయన ముద్దాయి అన్నారు. తమ గురించి జగదీష్ రెడ్డి మరోసారి మాట్లాడితే… దెబ్బలు తప్పవని హెచ్చరించారు. జగదీష్ రెడ్డి గురించి మాట్లాడటం తన స్థాయికి తగదని, జగదీష్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డే చాలని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ బస్సు యాత్ర కాదు..మోకాళ్ళ మీద యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలలో బీఆర్‌ఎస్ పార్టీకి డిపాజిట్ రాదంటూ వ్యాఖ్యలు చేశారు. నల్గొండ, భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచ్‌గా పనికిరారని విమర్శించారు. నల్గొండ అభ్యర్థైతే వాళ్ల సొంత ఊర్లోనూ సర్పంచ్‌గా గెలవలేడన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కవితకు బెయిల్ దొరకదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పైగా త్వరలో తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్ కూడా జైలుకు వెళ్లడం ఖాయమని వెల్లడించారు. కేసీఆర్ మోకాళ్లతో యాత్ర చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు రావని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఘోర పరాజయం తప్పదన్నారు. ఆ ఆవేదనతోనే పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటున్నారు.