– రైతు భరోసా నిధులను ఆపడం దారుణం
– అన్నదాతల ఉసురు తగులుతుంది
– బీజేపీ, బీఆర్ఎస్‌కు తగిన బుద్ధి వచ్చేలా ఓడించాలి
– రాష్ట్ర ప్రజలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపు
Minister Komatireddy latest comments(TS politics): తెలంగాణలో రైతుల చుట్టూ రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ విధానాలపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ దుష్ట రాజకీయ పన్నాగాలకు రైతులు బలవుతున్నారని విమర్శించారు. అసలే వర్షాలు లేక రైతులు తీవ్రమైన బాధలో ఉంటే కనీస మానవత్వం లేకుండా స్వార్ధ రాజకీయాల కోసం రైతుల నోటికాడ బుక్కను లాక్కోవడం ఏంటని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజనాలో రూపాయి లేకుండా ఆగం చేసిపోతే, తాము రైతుల కోసం రూపాయి రూపాయి కూడబెట్టి రైతు భరోసా అందజేస్తున్నట్టు తెలిపారు.
కానీ, బీజేపీ కుటిల రాజకీయాలు చేసి అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమయానికి బ్యాంక్ ఖాతాలలో జమ చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా ఆదేశాలు ఇచ్చారని, ఈ మాట తెలిసి అన్నదాతులు సంతోషపడే లోపలే ఈసీని అస్త్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో పడ్డ నిధులను ఆపేలా కుట్రలు చేయడం బాధాకరమన్నారు. ‘‘బీజేపీకి మొదటి నుంచి అన్నదాతలు అంటే అక్కసు, ఆగ్రహం. అందుకే, నల్ల చట్టాలు తెచ్చి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేసింది. ఈ నల్ల చటాలకు వ్యతిరేకంగా పోరాడిన వందలాది రైతులను పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు బీజేపీ తన గుప్పిట్లో ఉన్న ఈసీని అడ్డం పెట్టుకొని బ్యాంక్ ఖాతాలో పడ్డ రైతు భరోసా సొమ్ములను కూడా నిలిపివేసింది. ఇంత కంటే దారుణం ఎక్కడా ఉండదు. బీజేపీ చేస్తున్న కుట్రలను అన్నదాతలు అర్థం చేసుకుంటారు. ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు’’ అని విమర్శలు చేశారు.
Also Read: అది నీకు.. ఇది నాకు..! పార్టీ ఫండ్ దండుకుంటున్న గులాబీలు?
2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ రైతు బంధు డబ్బులు వేశారని, అప్పుడు ఆపని ఈసీ ఇప్పుడు ఎందుకు నిలిపివేసిందో చెప్పాలన్నారు కోమటిరెడ్డి. ఆనాడు కేంద్రంలోనూ ఇదే బీజేపీ ఉందన్న ఆయన, మరి అప్పుడు ఎందుకు ఆపలేకపోయిందని అడిగారు. బీఆర్ఎస్-బీజేపీ కలిసి ఆడుతున్న నాటాకాలని ప్రజలు ఇప్పటికే గుర్తించారని, రెండు పార్టీలకు రైతులే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. రైతు భరోసా కొత్త పథకం కాదన్న మంత్రి, గత కొన్ని రోజులుగా క్రమంగా డబ్బులు వేస్తున్నామని తెలిపారు. పెండింగ్ ఉన్న డబ్బులు ఇప్పుడు వేశామని, రాజకీయాలకు అతీతంగా గత ఎన్నికల సమయంలో రైతు బంధు డబ్బులు ముందుగానే నిధులు జమ చెయ్యమని అప్పటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీనే కోరిందని గుర్తు చేశారు. ఆ విధంగా రైతుల ప్రయోజనాల కోసం కృషి చేశామని చెప్పిన ఆయన, బీజేపీ, బీఆర్ఎస్ ఓట్ల కోసం రైతులను బలి పెట్టడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా నిధులు ఆపిన బీజేపీ, బీఆర్ఎస్‌ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.