Minister Komatireddy Venkatreddy: మాజీ మంత్రి హరీశ్ రావుపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. నాటకాల రాయుడు హరీశ్ రావు మళ్లీ జోకర్ అవతారం ఎత్తారని విమర్శించారు. ఎమ్మెల్యే రాజీనామా ఒక్కటే లైన్ ఉంటుందని, కానీ, హరీశ్ రావు రెండు పేజీలు రాశాడని అన్నారు. గతంలో పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె లేదని రెచ్చగొట్టి.. అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులకు ఈ నాలుగు నెలల్లో రూ. 26 వేల కోట్లు వడ్డీ కట్టామని వివరించారు. అయినప్పటికీ ఆగస్టు 15వ తేదీలోపు రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. ఇది అర్థం చేసుకోకుండా.. ప్రగల్భాలు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ దగ్గర హరీశ్ రావుది కేవలం నౌకరి మాత్రమేనని, సీఎం మాత్రం ఆయన కొడుకునే చేస్తారని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో దొంగ దీక్షలు చేసినట్టు చేస్తే ఇప్పుడు నడవదని అన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీనే దొంగల, దోపిడీ పార్టీ అని ఆరోపించారు. మామ డ్రామాలు ఆపాడని, ఇప్పుడు అల్లుడ హరీశ్ రావు మొదలు పెట్టాడని చెప్పారు. వాళ్లు డ్రామాలు ఆడితే ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.
Also Read: బిడ్డ కోసం మ్యాచ్‌ఫిక్స్? కేసీఆర్ బస్సు అక్కడికి ఎందుకు వెళ్లడం లేదు?
20 ఏళ్ల క్రితమే 76 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారమే సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని గుర్తు చేశారు. ఉపాధి లేకపోతే పేదవాళ్లకు ఉపాధి చట్టంతో తిండి పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని వివరించారు.
బీఆర్ఎస్ పని అయిపోయిందని, జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత ఆ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాల్సిందేనని మంత్రి కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న కేసీఆర్ ఆయన పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని సార్లు సెక్రెటేరియట్‌కు వచ్చారని నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తానని లేకుంటే తన మెడ మీద తలకాయ ఉండదని అన్నారని పేర్కొన్నారు. మరి ఆ తలకాయ అలానే ఉన్నది కదా.. నువ్వు ఆ పని చేయలేదని, కాబట్టి, మమ్మల్ని ఆ తల తీయమంటావా? లేక దళితులను తీయమంటావా? అని ప్రశ్నించారు. అధికారం పోయి నాలుగు నెలలు కాలేదు… పిచ్చిపట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.