Minister Jupally Krishnarao: నాగర్‌కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ లోక్ సభకు ఇంచార్జీగా మంత్రి జూపల్లి కృష్ణారావును నియమించింది. నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని కొల్లాపూర్ సెగ్మెంట్ నుంచి జూపల్లి కృష్ణారావు గెలిచారు. దీంతో డాక్టర్ మల్లు రవిని గెలిపించడానికి జూపల్లి కృష్ణారావు సీరియస్‌గా పని చేస్తున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీలైన చోట వినూత్నంగా క్యాంపెయిన్ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని గెలిపించాలని జూపల్లి ప్రచారం చేస్తున్నారు. శనివారం ఆయన సొంత నియోజకవర్గంలో కొల్లాపూర్ మండలం బోరబండ తండాలో ప్రచారం చేశారు. వృద్ధులు, మహిళలు, తండా వాసులు ఓ చెట్టు వద్దకు చేరుకున్నారు. చాలా మంది ఆ చెట్టు చుట్టూ కూర్చుని ఉన్నారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకంగా చెట్టు ఎక్కి ప్రసంగం చేశారు. దీంతో మల్లు రవిని గెలిపించడానికి జూపల్లి చెట్టు ఎక్కారే అని సోషల్ మీడియాలో సరదా కామెంట్లు వస్తున్నాయి.
Also Read: ‘పప్పు బఠాణీలు అమ్ముకునేవాళ్లు కోటీశ్వరులయ్యారు.. వారి బండారం బయటపెడతా’
మల్లు రవి కోసం చెట్టెక్కిన జూపల్లి..#Telangana #LokSabhaElections2024 #Politics #jupally #MalluRavi #congress #bigtv #NewsUpdates @jupallyk_rao @DrMalluRavi @INCTelangana pic.twitter.com/b6zAc5oXHi
— BIG TV Breaking News (@bigtvtelugu) April 20, 2024
చెట్టు ఎక్కిన మంత్రి జూపల్లి స్థానికులతో సరదాగా మాట్లాడారు. ఎక్సైజ్ శాఖ తన చేతిలోనే ఉన్నదని, సారాయి, లిక్కర్, కోటర్ అంటూ మాట్లాడుతుండగా స్థానికులు ఒక్కసారిగా నవ్వేశారు. ఆ తర్వాత తాను చెట్టు ఎందుకు ఎక్కారో కూడా మంత్రి జూపల్లి వివరించారు. తాను తొమ్మిదో తరగతి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో చదివానని గుర్తు చేశారు. కొడంగల్‌లో చదువుతున్నప్పుడు మిత్రులతో కలిసి ఇలాగే చెట్లు ఎక్కేవాడినని బాల్య జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు. ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. డాక్టర్ మల్లు రవిని లోక్ సభకు పంపించాలని, మన బాధలను లోక్ సభలో రవి వినిపిస్తారని భరోసా ఇచ్చారు.
అన్ని వర్గాలకు హస్తం పార్టీ అండగా ఉంటుందని మంత్రి జూపల్లి అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే తప్పకుండా అమలు చేస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గ్యారంటీలను అమలు చేస్తున్నట్టే కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఐదు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని, ఇది వరకే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని, ఎన్నికల కోడ్ ముగిశాక మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేస్తామని తెలిపారు.