Mining Fighting, MLA’s Brother Arrested : ఎక్కడైనా సర్కారు మారిందంటే, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడడం సహజమే. శాఖల ప్రక్షాళనలో భాగంగా అధికారుల నుంచి వివరాలు సేకరించే క్రమంలో గత పాలకుల పాపాలు వెలుగుచూస్తుంటాయి. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోంది. కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమ దందాలు, కబ్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుపై భూకబ్జా కేసు నమోదైంది. అంతకుముందు మల్లారెడ్డి కబ్జాలపై బుల్డోజర్ ప్రయోగం జరిగింది. వీటిపై చర్చ జరుగుతుండగానే, పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడి అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది.
ఈ అరెస్ట్ ఎందుకు..?
ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేసిన కేసులో మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్ పేరుతో మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు మధుసూదన్. పరిమితికి మించి మైనింగ్ చేశారని ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పటాన్ చెరు పీఎస్‌లో కేసు ఫైల్ అయింది.
క్వారీ సీజ్
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని లక్డారంలో ఉంది మధుసూదన్ రెడ్డి క్వారీ. కాకపోతే ఇది తన కుమారుడి పేరిట నడిపిస్తున్నారు. కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి తవ్వకాలు చేశారు. అంతేకాదు, గడువు అయిపోయినా కూడా మైనింగ్ చేశారు. ఈ నేపథ్యంలో క్వారీని అధికారులు సీజ్ చేశారు. పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే, ఆ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అనుచరులు అక్కడకు చేరుకుని కాసేపు హల్ చల్ చేశారు.
ప్రభుత్వ కుట్రేనంటున్న మహిపాల్ రెడ్డి
పూర్తి పర్మిషన్స్‌తోనే తాము క్వారీ నడిపిస్తున్నట్టు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అంటున్నారు. ప్రజల ఆశీర్వాదంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తాను తప్పు చేసి ఉంటే మళ్లీ ఎందుకు గెలుస్తానని అన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. మధుసూదన్ అరెస్ట్ అక్రమమని, ప్రజా కోర్టులోనే దీనిపై తేల్చుకుంటానని స్పష్టం చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలో గత పదేళ్లుగా ఎవరి మీదా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని తెలిపారు మహిపాల్ రెడ్డి.