- కేసీఆర్ కు అత్తగారి ఊరిలో నిరసన సెగ
- కేసీఆర్ పై మిడ్ మానేరు నిర్వాసితుల ఆగ్రహం
- అప్పడు అధికార హోదాలో రూ.5 లక్షల 4 వేలు ఇస్తామన్న కేసీఆర్
- నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా ఇస్తామన్న సారు
- కేసీఆర్ హామీలపై నిలదీసిన మిడ్ మానేరు బాధితులు
- ప్రతిపక్ష నాయకుడిగా తమ సమస్యలపై పోరాడాలని వినతి
- తీవ్రమైన ఎండలకు చుక్క నీరు లేకుండా ఎండిపోయిన మిడ్ మానేరు
- కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్న నిర్వాసితులు
Mid Maneru project victims questioned Kcr about compensation:
తెలంగాణలో ఎంతో చరిత్ర కలిగిన మిడ్ మానేరు రిజర్వాయర్ కాకముందు హాయిగా, ఆహ్లాదంగా ఉండే తమ బతుకులు రిజర్వాయర్ కోసం తమ పొలాలు, ఇండ్ల స్థలాలు త్యాగం చేశారు. వారి త్యాగాలు పరిగణనలోకి తీసుకుంటామని..తగిన న్యాయం చేస్తామని నాటి కేసీఆర్ సర్కార్ నిర్వాసితులకు భారీ ఎత్తున రూ.5 లక్షల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఓడ దాటాక బోడి మల్లన్న సామెతలా పరిహారం విషయంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలు, కార్యకర్తల పేర్లు కూడా పరిహారం లిస్ట్ ల చేర్చారు. ఇంకా పెండింగ్ లో చాలా మంది నిర్వాసితులు ఉన్నారు. పదేళ్లకు పైగా నిర్వాసితులు పోరాడుతునే ఉన్నారు. అయినా వారి గోడు అరణ్యరోదనే అవుతోంది తప్ప కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. ఇప్పటికీ ఇక్కడి రిజర్వాయర్‌తో నష్టపోయి ఇంకా కోలుకోలేక పోతున్న కూలీలు పెద్దసంఖ్యలో కనిపిస్తున్నారు. పోనీ.. ఇప్పుడు వచ్చిన సర్కారైనా పట్టించుకుంటున్నదా అంటే.. ఓట్ల కోసం మాటలు చెప్పారే తప్ప.. వందరోజుల పాలనలో ఒక్కసారి ఇటువైపుగా చూడలేదని మిడ్ మానేరు నిర్వాసితులు ఒకింత ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మిడ్ మానేరు నిర్వాసితుల విషయంలో సొంత అత్తగారి ఇలాఖాలోనే కేసీఆర్ కు నిరసన సెగ తగిలింది.
అత్తగారి ఇంట అల్లుడికి నిరసన సెగ
బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికలలో భాగంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు కరీంనగర్ నుంచి వెళుతుండగా అక్కడ మిడ్ మానేరు నిర్వాసితుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ తగిలింది. కొదురుపాక కేసీఆర్ అత్తగారి ఊరు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో ఉంది. ఊహించని ఈ పరిణామానికి కేసీఆర్ సహా మిగిలిన పార్టీ నేతలు, కార్యకర్తలు షాక్ కు గురయ్యారు. కొదురుపాక గ్రామానికి చెందిన మిడ్ మానేరు నిర్వాసితులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలు పట్టించుకోలేదని నిర్వాసితులు కాన్వాయ్ కు ఎదురుగా వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్ మానేరు నిర్వాసితులకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల నాలుగు వేలు ఇస్తా అని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడిగా మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల నాలుగు వేలు వచ్చేలా అసెంబ్లీలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కాన్వాయ్ వెళ్లిపోయాక బీఆర్ఎస్ నాయకులు నిర్వాసితులతో వాగ్వాదానికి దిగారు.
భూములు, ఇళ్లు కోల్పోయిన 12 గ్రామాల ప్రజలు
అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ హయాంలో మిడ్ మానేరు ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. లక్షలాది పంట ఎకరాలకు సాగునీరు, తాగునీటి అవసరాలను తీరుస్తుందనే భావనతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రుజల సహకారం తోడయింది. ప్రాజెక్టు ముంపు పరిధిలోని గ్రామాల ప్రజలు తమ ఇళ్లు, భూములు త్యాగం చేశారు. నాటి సర్కార్ లెక్కల ప్రకారం 12,500 మంది ముంపు పరిహార బాధితులు ఉన్నారు. వీరికి పునరావాస సహాయ ప్యాకేజీ కింద 2005లో నాటి ప్రభుత్వం జీవో నెంబర్ 69 ప్రకారం ఐఏవై కింద ఇళ్లు మంజూరు చేసింది. ముంపు నష్టపరిహారం కూడా ఇస్తామని పేర్కొంది. అయితే పరిహారం అమలులో తీవ్రమైన జాప్యం జరుగుతూ వస్తోంది. 2018 జూన్ నాటి సీఎం కేసీఆర్ అధికార హోదాలో ఈ ప్రాంతానికి వచ్చి మిడ్ మానేరు బాధితులకు ఐఏవై ఇళ్లకు బదులు డబుల్ బెడ రూమ్ ఇళ్లను ఇస్తామన్నారు. అది గాక రూ.5 లక్షల నాలుగు వేలు పరిహారం కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పన్నెండు గ్రామాల రైతులంతా సాగు భూమిని కోల్పోయిన నేపథ్యంలో నీలోజిపల్లి నుండి నందిగామ, అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌ను, స్కిల్ డెవలెప్‌మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తద్వారా వారిలో నైపుణ్యత పెంచి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అలాగే 2009 కొత్త గెజిట్ ప్రకారం 2015 మే ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తామన్నారు. అంతే అప్పటినుంచి అధికారం కోల్పోయేదాకా ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయారు.
బాధితుల తీరని వ్యథ
మిడ్ మానేరు నిర్వాసితుల కథ.. ఎప్పటికీ, ఎన్నటికీ తీరని ఓ వ్యధలానే తయారైందే తప్ప.. ఏ పార్టీలు అధికారంలోకొచ్చినా.. చేసేదేమీ లేదనే నిర్లిప్తత ఇప్పుడీ ప్రాంతంలో కనిపిస్తోంది. మరోవైపు కరవు తెచ్చిన కల్లోలం రాష్ట్ర రైతాంగాన్నంతా నీటి కోసం కేకలు పెట్టిస్తుంటే.. ఇక్కడ కరవు తేల్చిన శిథిలాల్లో నిర్వాసితులు తమ గతకాలపు చేదు జ్ఞాపకాలను వెతుక్కుంటున్నారు. తమ గ్రామాలను చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని నిర్వాసితులు అంటున్నారు. మిడ్ మానేరు పూర్తిగా ఎండిపోయింది. దానిని చూసి కన్నీళ్లు ఆగడం లేదని చెబుతున్నారు. నీళ్లల్లో నుంచి ఇళ్లు తేలడంతో చూడటానికి వచ్చామని నిర్వాసితులు అంటున్నారు. పచ్చని పొలాలు ఇప్పుడు బొందల గడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. తమ జీవితాలు మిడ్ మానేరులో మునిగిపోయాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తమకు తెలిసిన చాలా మంది జీవితాలు బాగుపడ్డాయాని చెబుతున్నారు. తమను కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతో ఏర్పాటైన మీడ్ మానేరు రిజర్వాయర్ మళ్లీ వాళ్ల హయాంలోనే నిర్వాసితులకు తగిన న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.