Chiranjeevi
ఆంధ్ర ప్రదేశ్

Chiranjeevi In BJP: చిరు ఫిక్స్ అయినట్టేనా? బీజేపీ వైపు మెగాస్టార్ చిరంజీవి అడుగులు!

స్వేచ్ఛ సెంట్రల్ డెస్క్: బీజేపీలో చేరడానికి మెగాస్టార్ చిరంజీవి ఫిక్స్ అయ్యారా? అడుగులు ఇక అటేనా? కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగానే ఉన్నారా? బీజేపీ అగ్రనేతలతో కూడా సోదరుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరు చర్చలు జరిపారా? అంటే గత కొన్నిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే అక్షరాలా నిజమనే విశ్లేషణలు మెండుగా వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తుండటం, నేరుగా కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీతోనే వేదికలు పంచుకోవడం ఇవన్నీ అడుగులు అటేనని చెప్పడానికి సంకేతాలని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్న చర్చ. ఈ క్రమంలోనే మెగాభిమానులు, అనుచరులు, జనసేన కార్యకర్తలు ఇంద్ర సినిమాలోని డైలాగ్స్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కాశీకి వెళ్ళకున్నా, కాషాయం కప్పుకోవడం మాత్రం దాదాపు ఖాయమని కాకపోతే ఇది రాజకీయ కాషాయం అని చెబుతున్నారు.

రీ ఎంట్రీ ఉన్నట్టే!
ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, ఆ తర్వాత ఆంధ్రాలో అంతంత మాత్రమే పార్టీ పరిస్థితి ఉండటంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినా కనీసం ఎన్నికల ప్రచారం కూడా చేయడానికి సాహసించలేదు. ఎలాంటి విమర్శలు, ఆరోపణలకు తావు ఇవ్వకూడదని మిన్నకుండిపోయారు. పరోక్షంగా తమ్ముడికి సపోర్టు చేస్తూ అండగా ఉంటూ వస్తున్న ఆయన ఇంతవరకూ రాజకీయంగా ఎలాంటి వేదికలూ పంచుకోలేదు. ఒక్క పవన్ ప్రమాణ స్వీకారం రోజు తప్ప ఎక్కడా కనిపించలేదు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఎందుకో మళ్లీ ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనడం, అగ్రనేతలు, ప్రధాని మోదీ, అమిత్ షాలతో వేదికలు పంచుకునే పరిస్థితులను చూస్తుంటే నిజమేనని చెప్పుకోవాల్సి వస్తోంది. దీనికి తోడు సినిమాలు కూడా పెద్దగా లేకపోవడం, ఆశించిన రీతిలో ఆడకపోవడం కూడా రీ ఎంట్రీకి కారణమై ఉండొచ్చనే చర్చా నడుస్తోంది.

ఇందులో నిజమెంత?
బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, పెద్దలతో వేదికలు పంచుకోవడాన్ని చూస్తున్న మెగాభిమానులు రీ ఎంట్రీ కాషాయ కండువాతో ఫిక్స్ అయినట్లేనని చర్చించుకుంటున్నారు. అయితే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలని అభిమానుల ద్వారా లీకులు వదులుతున్నారా? అనే సందేహాలు లేకపోలేదు. అదిగో ఉప రాష్ట్రపతి, ఇదిగో గవర్నర్, కేంద్ర మంత్రి అంటూ గట్టిగానే ప్రచారం నడుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు ఏకంగా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా మెగాస్టార్ అంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకోవడం, రాజ్యసభకు పంపడం, ఆ తర్వాత కేంద్రమంత్రి పదవి కూడా ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే అగ్రనేతలతో పవన్, చిరు చర్చలు కూడా ముగిశాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. చిరు సేవలను అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో వాడుకోవాలని కమలనాథులు భావిస్తున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా చిరు కానీ, మెగా బ్రదర్స్ ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదు. దీంతో మౌనం అంగీకారమే అని, రీ ఎంట్రీ ఫిక్స్ అంటూ చిరు అత్యంత సన్నిహితులు సైతం చెబుతున్నారు. మెగాస్టార్ మనసులో ఏముందో? అడుగులు ఎటు పడతాయో చూడాలి.