- విపక్ష కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉల్గులన్ న్యాయ్
- అస్వస్థతతో హాజరుకాలేకపోయిన రాహుల్ గాంధీ
- ర్యాలీలో పాల్గొన్న 28 పార్టీ నేతలు
- ఉల్గులన్ అర్థం కోసం ఆసక్తి చూపిన నెటిజన్లు
- జార్ఖండ్ కల్చర్ తో ముడిపడివున్న పేరుతో ర్యాలీ
- ముండారీ భాషలో వాడే పదం
- ఆదివాసీల ఆరాధ్యదైవం బిర్సా ముండా స్ఫూర్తి
- మొదటినుంచి ఆదివాసీలకు కాంగ్రెస్ రెడ్ కార్పెట్
- కాంగ్రెస్ ర్యాలీలు, ధర్నాలు, దీక్షల పేర్ల వెనుక బడుగుల స్ఫూర్తి
Meaning of Ulgulan Congress Conduct Rally In Ranchi: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివారం విపక్ష పార్టీల భారత కూటమి ‘ఉల్గులన్ న్యాయ ర్యాలీ’ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ సక్సెస్ అయింది. జార్ఖండ్ రాజధానిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా.. కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి కల్పన, సునీతలతో పాటు జేఎంఎం అధినేత శిబు సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత & బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభాత్ తారా గ్రౌండ్‌లో జరిగిన ఈ ర్యాలీలో మొత్తం 28 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి.
అస్వస్థత కారణంగా రాహుల్ గాంధీ ఈ ర్యాలీకి హాజరుకాలేకపోయారు. అయితే ‘ఉల్గులన్ న్యాయ్’ రాంచీ సభ నేపథ్యంలో ఈ ర్యాలీ పేరు సోషల్ మీడియా బాగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ‘ఉల్గులన్’ పదానికి అర్థం ఏమిటి ? అనేది తెలుసుకునేందుకు నెటిజన్లు పెద్దఎత్తున గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ శోధనలో వారు చారిత్రక వాస్తవాలను కళ్లకు కట్టిన విధంగా తెలుసుకున్నారు. అవేమిటో మనమూ తెలుసుకుందాం..
ఆదివాసీల పోరాట మంత్రం
ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు, ప్రతిపక్ష నేతల అణిచివేత, బీజేపీ నిరంకుశత్వ ధోరణి, దేశ వ్యాప్తంగా రైతులకు జరుగుతున్న అన్యాయం,
వీటికి వ్యతిరేకంగా రాంచీలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదివారం సభను నిర్వహించింది. దీనికి ‘ఉల్గులన్ న్యాయ్’ అనే పేరు పెట్టారు. ‘న్యాయ్’ అనేది రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు సంబంధించిన పదం. ‘ఉల్గులన్’ అనేది జార్ఖండ్ గడ్డపై జరిగిన ఆదివాసీ ఉద్యమంతో ముడిపడిన పదం.
బిర్సాముండా స్ఫూర్తి
‘ఉల్గులన్’ అనేది జార్ఖండ్‌కు చెందిన ముండారీ భాషలోని పదం. ‘విప్లవం’ అని దీని అర్థం. ఆదివాసీల హక్కుల కోసం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా విప్లవ యోధుడు బిర్సా ముండా చేసిన పోరాటానికి ‘ఉల్గులన్’ అనే పేరును వాడేవారు. దీన్నే ఇంగ్లిష్‌లో ‘ది గ్రేట్ టూమల్ట్’ అని పిలుస్తుంటారు. బ్రిటీషర్లను జార్ఖండ్ నుంచి తరిమికొట్టి ఆదివాసీల స్వయంపాలిత ‘ముండా రాజ్’ను స్థాపించాలనే గొప్ప లక్ష్యంతో ఆనాడు బిర్సా ముండా ఉద్యమించారు. 1899-1900 సంవత్సరాల మధ్యకాలంలో రాంచీకి దక్షిణంగా ఉన్న ఆదివాసీ ప్రాంతంలో బిర్సా ముండా నాయకత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది.