- ప్రపంచ వ్యాప్తంగా మేడే సంబురాలు
- పదేళ్లలో మోదీ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు
- పెట్టుబడిదారులకే అవకాశాలు ఇస్తున్న మోదీ
- రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ
- రైతు రుణాలను రెట్టింపు చేశారు
- ఉద్యమం చేస్తున్న రైతులపై కేసులు
- ప్రభుత్వ సంస్థలన్నీ కుదేలు
- ప్రైవేటీకరణపైనే ధ్యాస
- ప్రతి బడ్జెట్ లోనూ కార్మిక సంక్షేమానికి మెండి చెయ్యే
Modi injustice farmers, industry labour May day : ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అనగానే కష్టించి పనిచేసే చేతులు గుర్తుకువస్తాయి. అవి ఆగ్రహిస్తే పిడికిళ్లు బిగిస్తాయి..అవసరమైతే భూకంపాలను పుట్టిస్తాయి…ఉద్యమాలు రగిలిస్తాయి. అంతకు మించి పాలకుల మెడలు కూడా వంచుతాయని చరిత్ర మనకు చబుతోంది. అయితే మేడే సందర్భంగా భారత ప్రధాని మోదీ ఈ పదేళ్లలో కార్మికులకు, కర్షకులకు ఏ మేరకు సంక్షేమ పథకాలు ప్రకటించారు..ఆ ఫలాలు కార్మికులు ఎంతవరకూ అందుకున్నారనేది తెలుసుకుందాం..
సంక్షోభంలో వ్యవసాయం, పారిశ్రామికం
మోదీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో దాదాపు అన్ని రంగాలలో వైఫల్యం స్సష్టంగా కనిపిస్తోందని విపక్షాలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ఫలితంగా గ్రామీణ, పట్టణ పేదలు, కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారు. ఉపాధి లేమితో నిరుద్యోగం పెరుగుతూ ఉంది. పేదరికం, నిరుద్యోగం పెరుగుతుండగా ఇంకొక వైపు సంపద కేంద్రీకరణ పెరుగుతున్నది. మోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల దేశం అప్పుల్లో కూరుకుపోతూ ఉంది. భారత దేశంలో పని చేసే జనాభాలో 50% పైగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత ప్రాధాన్యత గల వ్యవసాయ రంగాన్ని మోదీ ప్రభుత్వ సంక్షోభంలోకి నెడుతూనే ఉంది అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ అందుకు విరుద్ధంగా రైతాంగ వ్యతిరేక విధానాలు అమలు జరుపుతున్నారు. పంటలకు న్యాయమైన మద్దతు ధరలు ప్రకటించి వాటికి చట్టబద్ధత కల్పించడానికి వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, పంటలకు న్యాయమైన ధరలు లభించకపోవడం వల్ల వ్యవసాయం ద్వారా నామమాత్రపు ఆదాయమే లభిస్తున్నది.
లక్షా 25 వేల రైతుల ఆత్మహత్యలు
జాతీయ గణాంకాల శాఖ 2021 సెప్టెంబర్ 10న ప్రకటించిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం చిన్న రైతులకు వ్యవసాయం ద్వారా రోజు వారీ సగటు ఆదాయం 27 రూపాయలు. నెలకు రూ. 816 కాగా, సంవత్సరానికి 3,898 రూపాయలు మాత్రమే. వ్యవసాయ ఆదాయంతో పాటు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం కలుపుకుంటే కుటుంబ ఆదాయం కొంత పెరుగుతుంది. పంటలకు న్యాయమైన ధరలు లభించక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. 2012- 13లో వ్యవసాయ కుటుంబాల సగటు అప్పు రూ. 47వేలు కాగా, నేడు రూ. 80 వేలకు పైగా ఉంది.మోదీ పాలనలో అప్పుల పాలైన లక్షా 25 వేల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2020లో మూడు వ్యవసాయ చట్టాలు చేసి మద్దతు ధరల ప్రకటన నుండి, పంటల కొనుగోళ్ళ నుండి తప్పుకోనున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. తమ పంటలు ఇష్టమైన ధరకు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చనే మాయ మాటలతో రైతులను బడావ్యాపారుల కబంద హస్తాల్లో పెట్ట చూసింది. రైతులు ప్రమాదకర చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించడంలో ఆ చట్టాలను రద్దు చేసినా దొడ్డిదారిన అమలు జరుపుతూనే ఉంది. ఎరువులు, విత్తనాల ధరల పెరుగుదల అరికట్టలేకపోయింది. రైతులకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించుకుంటూ వస్తున్నది. వ్యవసాయాన్ని దండగ అన్నఅభిప్రాయం రైతాంగంలో కలుగజేసి, వారి భూము లు కాంట్రాక్టు వ్యవసాయానికి, కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలు అమలు జరుపుతున్నది. ప్రభుత్వ విధానాల ఫలితమే నేటి వ్యవసాయ సంక్షోభం అని ప్రతిపక్షాలు మోదీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి.
పెట్టుబడిదారులపైనే మొగ్గు
ఇక పారిశ్రామిక పరంగా చూస్తే దేశ ప్రయోజనాలకు అనుగుణమైన పారిశ్రామిక విధానం అమలు జరగలేదు. సామ్రాజ్యవాదులు, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా పారిశ్రామిక విధానం అమలు జరుగుతున్నది. మోదీ పాలనలో పారిశ్రామిక విధానం బడా పెట్టుబడిదారుల చుట్టూ తిరుగుతున్నది. వలస పాలనలోను, అధికార మార్పిడి తర్వాత సామ్రాజ్యవాదులకు, విదేశీ పెట్టుబడిదారులకు, దళారీలుగా వ్యవహరించిన టాటా, బిర్లాల చట్టూ పారిశ్రామిక విధానం చాలా కాలం కొనసాగితే, నేడు ప్రధాని మోదీకి ప్రియమైన అదానీ, అంబానీల చట్టూ తిరుగుతున్నది. తన ఇష్టులైన వారికి ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ కట్టబెడుతున్నారు. పెట్టుబడిదారులకు అనేక రాయితీలు ఇస్తున్నారు. నాలుగు లేబర్ కోడ్‌ల ద్వారా మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు వెల్లడవుతున్నాయి. పౌరసత్వ చట్ట సవరణల మతాల మధ్య, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నది. ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలపై రాజ్యాంగ సంస్థలను ప్రయోగించి, కేసులు బనాయించి జైళ్ల పాలు చేస్తున్నది. ఈ విధంగా ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలన సాగిస్తున్నది. మోదీ ప్రభుత్వ నిరంకుశ పాలనను దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలి అంటూ ముక్తకంఠంతో ప్రతిపక్షాలు నినదిస్తున్నాయి.