Massive Encounter In Chhattisgarh, Maoists Killed: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ రెండునెలల వ్యవధిలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మూడో ఎన్ కౌంటర్ ఇది. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందగా, 12 మందికి పైగా మావోయిస్టులు గాయపడ్డారు. ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని దండకారణ్యంలో మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దంతెవాడ,బీజాపూర్, నారాయణ్‌పుర్, బస్తర్ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సభ్యులు, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు కలిసి గురువారం సరిహద్దుల్లో కూంబింగ్ చేస్తుండగా మావోలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. భద్రతా బలగాలు కూడా దీటుగా స్పందించి ఎదురు కాల్పులతో బదులిచ్చాయి.ఈ ఘటనా జిల్లా సరిహద్దు పల్లెవాయ హందవాడ ప్రాంతంలో జరిగింది.
ఉదయం మొదలైన ఈ ఎన్‌కౌంటర్ ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. కాగా..పారిపోయే ప్రయత్నంలో ఉన్న పలువురు మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనా ఉదయం 11 గంటల సమయంలో ఇరువర్గాలు పరస్పరం ఎదురుపడడంతో ఈ కాల్పులకు దారితీసింది. ఐదు గంటల పాటు సాగిన ఈ భీకర పోరులో ఏడుగురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.ఈ ఘటనతో కలిపి ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 112 మంది నక్సలైట్లు మరణించారు.
Also Read: తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో అబ్బాయిలదే పైచేయి..
ఏప్రిల్ 30న నారాయణ్‌పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఇదే తరహాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నాటి ఘటనలో ముగ్గురు మహిళలు సహా మొత్తం 10 మంది నక్సలైట్లు భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది నక్సలైట్లు హతం అయ్యారు. మే 10న బిజాపుర్ జిల్లాలోని పిడియా గ్రామానికి సమీపంలోనూ ఇదే తరహాలో భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఎన్కౌంటర్లో 12 మంది నక్సల్స్ చనిపోయారు. అయితే, పిడియా గ్రామానికి సమీపంలో జరిగినది బూటకపు ఎన్‌కౌంటర్ అని, చనిపోయిన వారు అసలు నక్సలైట్లే కాదని కొందరు స్థానికులు, సామాజిక ఉద్యమకారులు ఆరోపించారు.