Maoists Killed: లోక్ సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గడ్‌లో తూటాల చప్పుళ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. భద్రతా బలగాలు ముఖ్యంగా బస్తర్ రీజియన్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. బస్తర్ రీజియన్‌లోని ఏడు జిల్లాల్లో సెక్యూరిటీ ఫోర్సెస్ ఇప్పటికే ఆపరేషన్లు ప్రారంభించాయి. ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలకు మావోయిస్టులు కుట్రలు చేస్తున్నారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇందులో భాగంగానే యాంటీ నక్సల్ ఆపరేషన్ల దూకుడు పెరిగినట్టు అర్థం అవుతున్నది. గతవారమే ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరగ్గా.. ఈ రోజు తెల్లవారుజామునే అదే జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.
మంగళవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో బీజాపూర్‌లో గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కొర్చోలి అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపడుతుండగా వారికి మావోయిస్టులు తారసపడినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఉభయ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. పలువురు గాయపడినట్టు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉభయ వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనను బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ధ్రువీకరించారు.
మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పలువురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్టూ తెలుస్తున్నది. ఘటనాస్థలి నుంచి పేలుడు పదార్థాలు, ఆటోమేటిక్ గన్‌లు, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
గతవారమే ఇదే జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా ఆరుగురు నక్సలైట్లు మరణించారు.
తాజా ఘటనతో ఈ ఏడాది ఎన్‌కౌంటర్‌లలో మరణించిన వారి సంఖ్య 45కు చేరింది.