- సంవత్సరకాలంగా రగులుతున్న మణిపూర్ హింస
- కుకీలు, మైతీల మధ్య చిచ్చుపెట్టిన రిజర్వేషన్ అంశం
- మణిపూర్ అల్లర్ల వెనుక మయన్మార్ కుట్ర
- మణిపూర్ యువకులకు మయన్మార్ లో తుపాకుల శిక్షణ
- ఎన్ఎస్‌సీఎన్ (ఐఎం) సంస్థ నుంచి ఆయుధాల సరఫరా
- గౌహతి కోర్టుకు నివేదిక అందించిన ఎన్ఐఏ అధికారులు
- మణిపూర్ లో శాంతియుతంగా పూర్తయిన పోలింగ్ ప్రక్రియ
- ఇప్పటికీ రిలీఫ్ క్యాంపులలోనే బిక్కుబిక్కుమంటున్న మైతీలు
Manipur Violence back key role of Mynmar terriorist organisation NIA :
దేశంలోనే తీవ్ర సంచలనం కలిగించిన మణిపూర్ హింసాత్మక ఘటనకు గత వారంతో సంవత్సరం పూర్తయింది. ఇప్పటిదాకా జరిగిన హింసాత్మక సంఘటనలో దాదాపు 200 మందికి పైగా మరణించారు. వేల సంఖ్యలో బాధితులు తమ ఇళ్లను కోల్పోయారు. ఇంకా 50 వేల మంది దాకా బాధితులు శరణార్థి శిబిరాలలో తలదాచుకుంటూ బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. మణిపూర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాలయాలలో కుకీలు అనుభవిస్తున్న రిజర్వేషన్లు మైత్రీ సామాజిక వర్గానికి కూడా అందించాలని చెబుతూ గతేడాది అక్కడి స్థానిక కోర్టు ఆదేశించింది. ఇక అప్పటినుంచే మైతీలు, కుకీల మధ్య అల్లర్లు ప్రారంభమయ్యాయి. అయితే ఒకానొక దశలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దానితో సైన్యాన్ని రంగంలోకి దించక తప్పలేదు కేంద్రానికి. అయితే ఈ గొడవలన్నీ పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగినట్లు ఎన్ఐఏ చెబుతోంది. ఇప్పటికే ఛార్జిషీట్ రెడీ చేసిన ఎన్ఐఏ కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. మణిపూర్ లో హింస కు పథకం ప్రకారమే స్కెచ్ చేసినట్లు ఎన్ఐఏ భావిస్తోంది. మణిపూర్ లో రెండు జాతుల మధ్య వైరం ప్రజ్వరిల్లింది. అయితే ఈ వైరంలో పాల్గొనేందుకు స్థానిక మణిపూర్ యువకులకు మయన్మార్ లో తుపాకుల శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ పేర్కొంది. మెయితీ వర్గానికి చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థలు కేవైకేఎల్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలకు చైనా -మయన్మార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహించే ఎన్ఎస్‌సీఎన్ (ఐఎం) సంస్థ ఆయుధాలను సప్లై చేసింది. సాయుధ పోరాటానికి అవసరమైన ఇతర సామగ్రిని అందించింది. ఈ మేరకు మార్చిన 27న అసోం రాజధాని గౌహతిలోని కోర్టుకు ఇచ్చిన ఛార్జిషీట్ లో పేర్కొంది.
మయన్మార్ ఉగ్రవాదుల పక్కా ప్లాన్
మణిపూర్‌లో శాంతిభద్రతలను అస్థిరపరిచేందుకు మయన్మార్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు పన్నిన కుట్రే జాతుల మధ్య ఘర్షణ అని ఎన్ఐఏ పేర్కొంది. మయన్మార్ హస్తం గురించి కేంద్రానికి సమాచారం అందించింది ఎన్ఐఏ. కేవైకేఎల్, పీఎల్ఏలకు ఎన్ఎస్సీఎన్ఐ(ఎం) ఆయుధాలు, పేలుడు పదార్థాలు సురక్షితంగా తరలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది. మయన్మార్‌కు చెందిన వారికి “సారవంతమైన భూములు” అందించి.. ఉగ్రసంస్థలు దోపిడీకి పాల్పడ్డారని వివరించింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి దోచుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రితో కుకీ- జో కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది ఎన్ఐఏ. వారిని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలిందని ఛార్జిషీటులో స్పష్టం చేసింది.
2023 మే 3న మొదలైన రెండు వర్గాల మధ్య వైరం
మైతీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని కుకీలు, కోర్టు ఆదేశాలు అమలు చేయాలని మైతీలు ర్యాలీలు తీయడంతో గతేడాది మే 3న రెండు వర్గాల మధ్య హింస నెలకొంది. ఆ హింస కారణంగా రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇంఫాల్ వ్యాలీలో మైతీలు, కాంగ్ పోప్కి ప్రాంతంలో కుకీల జనాభా ఎక్కువ. అలాగే ఉత్తర కొండ ప్రాంతంలో నాగాలు మెజారిటీగా ఉన్నారు. హింస నెలకొన్నప్పటి నుంచి ఒక వర్గం వారు మరో వర్గానికి చెందిన ప్రాంతానికి వెళ్లలేని భీకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రాణ రక్షణ కోసం మైతీలు, కుకీలకు చెందిన యువతీ యువకులు తుపాకులు పట్టుకుని తిరిగారు. గతేడాది గొడవలు జరుగుతున్నపుడు రెండు వర్గాల వారూ బలగాల దగ్గర గన్స్ ఎత్తుకెళ్లారు. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆ ఆయుధాలను సరెండర్ చేయాలని అధికారులు ఆదేశించినా ఎవరూ వాటిని వెనక్కి ఇవ్వలేదు. 2023లో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వారాలపాటు అల్లర్లు చోటుచేసుకోగా.. ఆ సమయంలో దాదాపు 4,200 ఆయుధాలను ఆందోళనకారులు ఎత్తుకెళ్లారు.
నిరాశ్రయులుగా మారిన మైతీలు
మణిపూర్ జనాభాలో మైతీలు 53 శాతం ఉన్నారు. అల్లర్ల కారణంగా వారిలో చాలా మంది ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. చాలా మంది ఇంకా రిలీఫ్ క్యాంపుల్లోనే భయం భయంగా గడుపుతున్నారు. ‘‘అల్లర్ల కారణంగా మేం ఇండ్లు మాత్రమే కాదు. సర్వం కోల్పోయాం. మళ్లీ ఇండ్లు నిర్మించుకొని సాధారణ జీవితం గడపాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది” అని చురాచాంద్ పూర్ కు చెందిన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మైతీ వర్గం వ్యక్తి తెలిపాడు. అల్లర్లకు ముందు చురాచాంద్ పూర్ లో తాను ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం చేసేవాడినని, ప్రస్తుతం ఆ వ్యాపారం కూడా లేకుండా పోయిందని అతను వాపోయాడు. రాష్ట్రంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని అతను చెప్పాడు. కాగా, మణిపూర్ లో రెండు లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా.. ఏప్రిల్ నెల 19, 26 తేదీల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది.