– చేతకానివాడే శాపనార్ధాలు పెడతాడు
– కేటీఆర్‌పై మల్లు రవి ఆగ్రహం
Mallu Ravi Fires On KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై చీటికి మాటికి కాలు దువ్వుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హస్తం నేతలు ఫైరవుతున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే ప్రతీ విషయంలోనూ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మల్లు రవి, కేటీఆర్‌కి చరిత్ర తెలియదని సెటైర్లు వేశారు. మల్లన్నపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, వాటిని ఉపసంహరించుకోవాలని, లేదంటే ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
‘‘అంజయ్యకి అక్షరం రాదు. సీఎం అయ్యారు. కేటీఆర్ మాటలను బట్టి ఆయన అహంకారి అని అర్థం అవుతోంది. ఈ అహంకారపు మాటలు ఇకనైనా మానుకోవాలి. బిట్స్ పిలానీ చదివిన వాళ్లనే ఓట్లు అడగండి. చేతకానివాడే శాపనార్ధాలు పెడతాడు. టీ అమ్ముకున్న వ్యక్తి ప్రధాని అయ్యాడు తప్పేముంది. కేటీఆర్ నువ్వు అమెరికాలో ఏం చేశావు. మంత్రివి కాలేదా?’’ అంటూ మండిపడ్డారు.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ వస్తున్నారని తెలిపారు మల్లు రవి. ఆమెను ఘనంగా సన్మానిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సాధన కోసం పని చేసిన అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని వివరించారు. పది సంవత్సరాలు పూర్తి అవుతున్నందున ప్రత్యేక వాతావరణంలో ఈ ఉత్సవాలను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
అలాగే, జయ జయహే తెలంగాణ గీతం, సవరించిన రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నట్టు చెప్పారు మల్లు రవి. రైతులకు ఆగస్టు 15 లోపే రుణమాఫీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలోని అన్నదాతలు సీఎం మాటలు నమ్ముతున్నారని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ తీసుకు వచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నట్టు వివరించారు.