– తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదు
– ఓడిపోయామనే బాధలోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
– పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం
– దేశాన్ని విడదీయాలనేదే బీజేపీ ప్రయత్నం
– తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఖర్గే
Congress: తెలంగాణలో ఎన్నికల ప్రచరానికి తెర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల ముఖ్య నేతలు రాష్ట్రానికి క్యూ కట్టారు. శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్, మహబూబ్ నగర్‌లో పర్యటించగా, ఇదే రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా తెలంగాణలో ప్రచారం చేశారు. ముందుగా హోటల్ తాజ్ కృష్ణలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన తర్వాత, భువనగిరి పార్లమెంట్ నియోజవకర్గంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదన్నారు. ఐదేండ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని స్పష్టం చేశారు. ఓడిపోయామనే బాధలోనే ప్రభుత్వం పడిపోతుందని కొందరు అంటున్నారని మండిపడ్డారు. ఈ ఐదేండ్లు తెలంగాణలో కాంగ్రెస్ అద్భుతమైన పాలన కొనసాగిస్తుందని తెలిపారు. జనాభా లెక్కలను మోదీ బయట పెట్టడం లేదని, అవి బయటకి వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. మోదీ హయాంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగడం లేదన్నారు. దేశాన్ని విడదీసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని, మోదీ అబద్ధాలపై అబద్ధాలు చెబుతున్నారని విమర్శలు చేశారు. తెలంగాణలో ఇచ్చిన 5 గ్యారెంటీలు అమలు చేశామని, ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు ఖర్గే. తెలంగాణలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నామన్నారు.
Also Read: సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద మృతి
బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడడం లేదని, కాంగ్రెస్ పార్టీని తిట్టడంపైనే ఫోకస్ పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ భయపడుతోంది కాబట్టే తిడుతోందన్న ఆయన, మటన్, మందిర్, మంగళ సూత్రం లాంటి అంశాలనే మోదీ ప్రస్తావిస్తున్నారని చురకలంటించారు. అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ సంస్థల రైడింగ్ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. యువతకు తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని, మోదీ ప్రధాని పదవిలో ఉంటూ ఎప్పుడూ హుందాగా మాట్లాడలేదన్నారు. దేశాన్ని ఎవరూ విడదీయలేరని, ఓట్ల కోసం కొందరు దేశాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు ఖర్గే.