– సీఎం చొరవతో పట్టాలెక్కిన ప్రాజెక్టు
– డీపీఆర్ సిద్ధం, కోడ్ ముగియగానే పనులకు శ్రీకారం
– రూ. 377 కోట్ల పనులకు పచ్చజెండా
– భూసేకరణ సమస్యల పరిష్కారానికీ ప్రణాళిక రెడీ
– అదనంగా లక్షన్నర ఎకరాలకు సాగునీరు
Mahardasa for Kalvakurthy Project : ఏనాటి నుంచో పెండింగ్‌లో పడిపోయిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ప్రాణప్రతిష్ఠ చేసేందుకు తెలంగాణ సర్కారు నడుం బిగించింది. ఈ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న జలాశయాలకు సంబంధించిన పెండింగ్ పనులను వీలున్నంత వేగంగా పూర్తిచేయటంతో బాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ అంశం మీదా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ ఈ ప్రాజెక్టు పెండింగ్ పనుల మీద ఒక రూట్ మ్యాప్‌ను రూపొందించింది. ఎన్నికల కోడ్ అనంతరం దీనిని వీలున్నంత త్వరగా పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో రూ. 377 కోట్ల విలువైన పనులకు ఇరిగేషన్ శాఖ అధికారులు డీపీఆర్ రూపొందిస్తున్నారు.
ఇక ఈ ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే, కొల్లాపూర్ సమీపంలో శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను దశల వారీగా ఎత్తిపోసేందుకు 2017లో ఈ పనులను గత ప్రభుత్వం ప్రారంభించింది. 2018 నాటికి ఈ పనులు పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం టెండర్లనూ ఖరారు చేసింది. అయితే, భూసేకరణ సమస్య, కొందరు కోర్టును ఆశ్రయించటంతో అనుసంధాన రిజయర్వాయర్లు, పంటకాలవల నిర్మాణం ఆగిపోయింది. దీంతో మొత్తం పనుల్లో కేవలం 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. చారకొండ మండలం తిమ్మాయిపల్లి, వెల్దండ మండలం, గుండాల, మాడ్గులలో భూసేకరణ అంశం వివాదం కావటంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
Read More: కోట్లు కొల్లగొట్టిన ప్రణీత్ గ్యాంగ్
కృష్ణా బ్యాక్ వాటర్ నుంచి పాతిక టీఎంసీల నీటిని ఎత్తిపోసి, మూడు దశల్లో అనుబంధ జలాశయాల్లో నింపటం ద్వారా 4,51,050 ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం కాగా, ప్రస్తుతం 3 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందించే స్థాయిలో పనులు జరిగాయి. 29 ప్యాకేజీల్లో ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటికీ, ఇప్పటివరకు కేవలం హెడ్ రెగ్యులేటర్‌తో బాటు వివాదాలు లేని ప్రాంతాల్లో మాత్రమే కాలువల నిర్మాణం జరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలంటే ఇంకా 82 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, జడ్చర్ల, వనపర్తి, దేవరకద్ర, కల్వకుర్తితో బాటు 28 మండలాలు, 336 గ్రామాలలకు సాగునీటితో బాటు తాగునీరు అందనుంది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు పూర్తిచేసేందుకు నిధుల మంజూరు చేయటంతో అదనంగా
1,44,450 ఎకరాలకు నీరు అందించేందుకు ఇరిగేషన్ అధికారులు డీపీఆర్ రెడీ చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు ముందున్న భూసేకరణ అంశాన్ని పరిష్కరించేందుకు సంబంధిత శాఖలతో ఇరిగేషన్ ఉన్నతాధికారులు భేటీ అవుతున్నారు. ఈ వ్యవహారంలో పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతుండటంతో కోడ్ తర్వాత పనుల ఆరంభానికి నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.