– నేడు మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
– బీఆర్ఎస్‌లో క్రాస్ ఓటింగ్ టెన్షన్
– గోవా క్యాంప్ నుంచి డైరెక్ట్ గా పోలింగ్ కేంద్రాలకు స్థానిక లీడర్లు
– మొత్తం 10 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
– ఓటుహక్కు వినియోగించుకోనున్న 1439 మంది
– ఏప్రిల్ 2న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
: పార్లమెంట్ ఎన్నికలను పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును తిరిగి నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అనుకుంటుంటే, అధికార కాంగ్రెస్ మరోసారి సత్తా చాటాలని చూస్తోంది. ఓటు శాతం పెంచుకున్న బీజేపీ కూడా అత్యధిక సీట్లు సాధిస్తామని ధీమాగా చెబుతోంది. పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ సందట్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతుండడం ఇంట్రస్టింగ్‌గా మారింది.
ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను రెడీ చేశారు. జిల్లాలో మొత్తం 1439 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ చేస్తున్నారు.
క్రాస్ ఓటింగ్ టెన్షన్
మొత్తం 1439 మంది ఓటర్లలో 900 మంది దాకా బీఆర్ఎస్ లీడర్లే. మిగిలినవాళ్లు కాంగ్రెస్, బీజేపీకి చెందిన వాళ్లున్నారు. అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. బీఆర్ఎస్‌కు చెందిన కొందరు కాంగ్రెస్‌లో చేరడం మరికొందరు టచ్‌లో ఉండడం గులాబీ క్యాంప్‌లో టెన్షన్‌కు కారణమైంది. క్రాస్ ఓటింగ్ భారీగా జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే, బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదు. ఒక్కో ఓటు 3 నుంచి 5 లక్షలు పలుకుతున్నట్టు సమాచారం.
మూడు పార్టీల్లోనూ క్యాంపులు
ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా వ్యూహాల్లో ఉంది. ఎలాగైనా ఓట్లను చీల్చి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రణాళికలో ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. తమ ప్రజాప్రతినిధులను గోవాలో పెట్టింది. వీరిని నేరుగా పోలింగ్‌కు తీసుకురానుంది. చాలామంది కాంగ్రెస్ గూటికి చేరడంతో బీఆర్ఎస్ దగ్గర 500 మంది దాకా ఉన్నట్టు సమాచారం. వీరందరూ బీఆర్ఎస్‌కే ఓటు వేసేలా కీలక నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ అందరితో మాట్లాడారు, అలాగే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వాళ్లతో కలిసి బీచ్ దిగిన ఫోటో వైరల్ అవుతోంది. ఏ ఒక్క ఓటు జారిపోకుండా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఓటు వేసే దాకా ఎవరినీ నమ్మడానికి లేదు. ఇంకోవైపు, కాంగ్రెస్, బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులు కూడా ఇతర రాష్ట్రాల్లో రహస్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ ఇవాళ పోలింగ్‌కు తీసుకురానున్నారు. ఏప్రిల్ 2వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.