– పెరిగిన ఓటు అనుకూలమేనని అంచనా
– హస్తం దూకుడును అడ్డుకోలేకపోయిన విపక్షాలు
– కలిసిరానున్న గ్రామ స్థాయి పార్టీ నిర్మాణం, ప్రచారం
– బలరాం నాయక్ గెలుపు కాదు.. మెజారిటీపై చర్చ
Telangana: తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి తీరే స్థానాల్లో ఒకటిగా మహబూబాబాద్ ఇప్పుడు చర్చలో నిలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోష్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కంటిన్యూ కావటం, పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పకడ్బందీ వ్యూహాలు, క్షేత్రస్థాయి కార్యకర్తల నిబద్ధత, కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల ప్రభావం, క్షేత్రస్థాయి పరిస్థితులు.. అన్నీ కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడనున్నాయని తెలుస్తోంది. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరామ్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవగా, బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, బీజేపీ తరపున అజ్మీరా సీతారామ్ నాయక్ పోటీచేసిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్‌ను అధిగమించేందుకు, వీలుంటే మరింత పెంచేందుకు కాంగ్రెస్ నేతలు ముందునుంచీ రచించిన వ్యూహాలు ఇక్కడ ఫలప్రదమయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్.. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను వెంటబెట్టుకుని గ్రామాలు, బూత్‌ల వారీగా ప్రచారం చేయటం, గతంలో అనేక కారణాలతో బీఆర్‌ఎస్‌లో చేరిన నేతలను తిరిగి పార్టీలో చేర్చుకోవటం, తటస్థుల ఓటును రాబట్టుకోవటంలో విజయం సాధించినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. మరోవైపు భద్రాచలం వంటి సీట్లలో కమ్యూనిస్టుల ప్రచారం కూడా బలరాం నాయక్ విజయానికి దోహదపడునుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత నానాటికీ బీఆర్ఎస్ పార్టీ బలహీన పడటం, బీజేపీకి మోదీ చరిష్మా తప్ప ఇక్కడ చెప్పుకునేందుకు ఎలాంటి గత చరిత్ర లేకపోవటం కూడా కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలుగా మారాయి.
Also Read: ‘ఆవిర్భవ’ వేడుకలకు అగ్ర నేతలు?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో భద్రాచలం మినహా 6 స్థానాలను కాంగ్రస్ దక్కించుకోగా, తర్వాత ఆ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హస్తం పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఈ ఏడు సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు 6,85,897 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌కు 4,43,910 ఓట్లు, బీజేపీకి 34,431 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, మే 13న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌లో 71.85% పోలింగ్ నమోదైంది. ఇందులో అత్యధికంగా నర్సంపేట నియోజకవర్గంలో 76.60%, అత్యల్పంగా భద్రాచలంలో 69.02 శాతం పోలింగ్ అయ్యింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 15,32,366 ఓట్లు ఉండగా, 11,01,030 ఓట్లు పోలయ్యాయి. 2019లో 69.06 శాతం ఓట్లు నమోదు కాగా, ఈసారి 71.85% ఓట్లు నమోదయ్యాయి. గతం కంటే 2.79శాతం ఎక్కువ నమోదు కాగా పెరిగిన ఓటు శాతం హస్తానికే కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు.