– కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్సే
– ప్రధానిగా రాహుల్.. జూన్ 9న మహూర్తం
– కారు షెడ్డుకేనన్న సీఎం రేవంత్
– బీజేపీకి ఓట్లడిగే అర్హతే లేదు
– బలరాం నాయక్‌దే గెలుపు
– మహబూబాబాద్ జనజాతర సభలో సీఎం రేవంత్
Lok Sabha Elections In Mahabubabad: ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం, రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావటం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బిడ్డను విడిపించుకోవటం కోసం బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రధాని కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ కథది ముగిసిన కథ అని, ఆయన కారు ఇప్పటికే షెడ్డకు పోయిందని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, మోదీపై ఫైరయ్యారు.
మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనీ, దానిని కాపాడుకునేందుకు అందరూ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలని సీఎం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం మండిపడ్డారు. ‘మానుకోట గడ్డమీద శపథం చేసి చెబుతున్నా.. పదేళ్లు అధికారంలో ఉంటాం’ అని స్పష్టం చేశారు. తెలంగాణను పదేళ్ల పాటు బీజేపీ మోసం చేసిందని అన్నారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోదీ తెలంగాణను అవమాన పరిచారని ధ్వజమెత్తారు. అప్పుడు పార్లమెంట్‌లోతానే ప్రత్యక్ష సాక్షినని గుర్తుచేశారు. ఉత్తర భారత దేశంలోని కుంభమేళాకు మోదీ వేల కోట్లు ఖర్చు చేశారని.. మేడారం జాతరకు ముష్టి రూ.3 కోట్లు ఇచ్చారని దుయ్యబట్టారు.
Also Read: మిస్‌ఫైర్ అవుతున్న మైండ్‌గేమ్
ఎర్రకోటపై ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నట్లు తెలిపారు. వచ్చే జూన్ 9వ తేదీన ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణం చేయబోతున్నారని అన్నారు. మానుకోట కాంగ్రెస్ కంచుకోట అన్నారు. ఆగష్టు 15వ తేదీ లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రూ. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. తండ్రి రెడ్యానాయక్ ను ఇంటికి పంపినట్టే బిడ్డ మాలోతు కవితను కూడా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మోదీ ప్రభుత్వం పక్కకు పెట్టిందని మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ మంజూరు చేస్తే… మోదీ లాథూర్ కు తరలించుకుపోయారని విరుచుకుపడ్డారు. ములుగు గిరిజన యూనివర్సిటీని సోనియా గాంధీనే మంజూరు చేశారని గుర్తుచేశారు. మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వబోమని చెప్పిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓట్లు అడగడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్‌ను కేసీఆర్ మోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేంద్ర మంత్రి పథవుల్లోనూ తెలంగాణకు అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు.ఢిల్లీలో రైతులను మోదీ ప్రభుత్వం కాల్చి చంపిందని ఆరోపించారు.100 రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.