– సీఎం ప్రకటనతో క్లారిటీ
– నాలుగేళ్ల నిరీక్షణకు తెర
– పెండింగ్‌లో పాతిక లక్షల దరఖాస్తులు
After the election, LRS : లేఅవుట్ క్రమబద్ధీకరణ ప్రక్రియ మరో మూడు నెలలకు వాయిదా పడింది. క్రమబద్ధీకరణ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ మార్చి 31లోపు రెగ్యులరైజ్ చేస్తామని ఫిబ్రవరి 26న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు గతంలో ఉన్న విధానాల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. అయితే, ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఇచ్చిన గడువుకు మార్చి 31 తుది గడువు కావటం, ఈ లోపు దీనిపై క్రమబద్ధీకరణ విధివిధానాలు ఖరారు కాకపోవటం, ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో తెలంగాణ సర్కారు జూన్ 4 వరకు ఈ అంశాన్ని పక్కనబెట్టేసింది.
ఎంతో కాలంగా జనం ఎదురుచూస్తున్న ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ వాస్తవానికి మూడు దశల్లో జరగాల్సి ఉంటుంది. మొదటి దశలో దరఖాస్తుల పరిశీలన, రెండవ దశలో అధికారుల క్షేత్ర స్థాయి, కొలతలూ వగైరా తీసుకోవటం వంటివి, అందుకు తగిన ఫీజును నిర్ణయించటం జరగుతుంది. తుది దశలో ఆ వివరాలతో కూడిన నోటీసులను దరఖాస్తుదారులకు పంపి సదరు మొత్తాన్ని నెల రోజుల్లో కట్టాలని సూచిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావటానికి కనీసం నెలరోజులైనా పడుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయి, దరఖాస్తుదారుడు తాను కట్టాల్సిన రుసుము చెల్లించిన తర్వాత అతని స్థలాన్ని క్రమబద్ధీకరిస్తున్నట్లు అధికారులు సర్టిఫికెట్ ఇస్తారు.
Read Also : నో వేస్టేజ్, కోలుకుంటున్న ఖజానా…!
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)ను ప్రకటించింది. 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31 వరకు రెండు నెలల పాటు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 13 కార్పొరేషన్ల నుంచి 4.13 లక్షలు, 129 మునిసిపాలిటీల నుంచి 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు అందాయి. కానీ గత ప్రభుత్వం ఈ ప్రక్రియను అటకెక్కించింది. ఈ నాలుగేళ్ల కాలంలో పలువురు దీనికోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.
2023 డిసెంబరులో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ దీనిపై ఎవరూ కంగారుపడొద్దనీ, 2020 నుంచి వచ్చిన అన్ని దరఖాస్తులనూ క్రమబద్ధీకరిస్తామని ప్రకటించటమే గాక వీలున్నంత త్వరగా ఎల్‌ఆర్‌ఎస్ నిమిత్తం మున్సిపల్, రిజిస్ర్టేషన్ శాఖల అధికారులను రంగంలోకి దిగాలని ఆదేశించారు. కానీ, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులంతా ఎన్నికల బాధ్యతల్లో మునిగిపోవటంతో ప్రస్తుతం ఈ ప్రక్రియ ముందుకు వెళ్లే ఛాన్స్ లేనందును జూన్ 4 తర్వాతే దీని మీద దృష్టిపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.