– ఓటు వేయడంపై అలసత్వం
– తలుపులు కొట్టి పోలింగ్ కేంద్రాలకు రావాలని అభ్యర్థనలు
– అయినా పెరగని ఓటింగ్ శాతం
– హైదరాబాద్ స్థానంలోనే అత్యల్పంగా పోలింగ్ పర్సంటేజీ
Hyderabad: ఎప్పటిలాగే గ్రామాల్లో కంటే రాజధాని నగరంలోనే పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. కంపెనీలు సెలవులు ప్రకటించినా.. అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసినా హైదరాబాదీ ఓటర్ల తీరు మారలేదు. సెలవు రోజును ఇంటిలో గడపడానికే కేటాయించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోక్ సభ స్థానంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది.
హైదరాబాద్‌లో 1984 నుంచి ఎంఐఎం కుటుంబం లేదా ఎంఐఎం మద్దతున్న అభ్యర్థులు మాత్రమే గెలుస్తూ వస్తున్నారు. రెండు సార్లు చార్మినార్ ఎమ్మెల్యేగా గెలిచిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. ఆ తర్వాత 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు హైదరాబాద్ ఎంపీగా గెలిచారు. ఈ సిట్టింగ్ ఎంపీ మరోసారి హైదరాబాద్ నుంచి బరిలో దిగగా.. బీజేపీ నుంచి కొంపెల్లి మాధవీలత ఆయనపై పోటీ చేస్తున్నారు. ఈ సారి వీరి మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుందని, ప్రచారమూ జోరుగా సాగడంతో పోలింగ్ శాతం పెరుగుతుందని చాలా మంది ఆశించారు. కానీ, ఈ సారి కూడా ఉదయం నుంచే హైదరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ నత్తనడకన సాగింది. సాయంత్రం మూడు గంటలకు ఇక్కడ 29.47 శాతం పోలింగ్ నమోదైంది. మూడు గంటలకల్లా గ్రేటర్ స్థానాలు మినహాయిస్తే మరే చోటా 55 శాతానికి తక్కువగా పోలింగ్ నమోదు కాలేదు. పాతబస్తీలోని కొన్ని చోట్ల గడప గడపకు తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థనలు చేశారు. తలుపు తట్టి మరీ ఓటు వేయాలని విజ్ఞప్తులు చేశారు.
Also Read: పోలింగ్ రోజున.. కీలక నేతలపై ఫిర్యాదులు, కేసులు
ఇదివరకూ ఇంతే
గత పార్లమెంటు ఎన్నికల్లోనూ హైదరాబాద్ లోక్ సభ స్థానంలో పోలింగ్ శాతం తక్కువే నమోదైంది. చాలా సార్లు రాష్ట్రంలోని అత్యల్పంగా ఇక్కడే ఓటింగ్ నమోదవుతున్నది. గత 2019 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తంగా 62.77 శాతం పోలింగ్ శాతం నమోదైతే.. హైదరాబాద్‌లోనే అత్యల్పంగా 44.84 శాతం రిపోర్ట్ అయింది. అప్పుడు గరిష్టంగా ఖమ్మంలో 75.3 శాతం నమోదైంది. అంతకుముందు 2014 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో మొత్తంగా 74.34 శాతం పోలింగ్ నమోదవ్వగా.. హైదరాబాద్‌లో 53.30 శాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చేవెళ్లలో 60.51 శాతం, మల్కాజ్‌గిరిలో 51.05 శాతం, సికింద్రాబాద్ 53.06 శాతం పోలింగ్ నమోదైంది. 2014లోనూ అత్యల్ప ఓటింగ్ గ్రేటర్ పరిధిలోని మల్కాజ్‌గిరిలో నమోదైంది. అప్పుడు ఓవరాల్‌గా ఏపీలో 74.34 శాతం పోలింగ్ నమోదైంది.