– తెలంగాణలో విస్తరిస్తోన్న బీజేపీ
– 8 సీట్లు గెలిచేందుకు వ్యూహం రెడీ
– బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై కన్ను
– బీసీ కార్డు కలిసొస్తుందనే ఆశలు
– 17 సీట్లను ఏ,బీ,సీ సెగ్మెంట్లుగా విభజన
– కమలవికాసం నిజమేనంటున్న సర్వేలు
Lotus Will Bloom BJP Party Every Where In Telangana: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందా? నాలుగు నెలల నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తిరగరాయనుందా? గత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి వచ్చిన అనూహ్య ఫలితాలే ఈసారి తెలంగాణలో రానున్నాయా?. ఈ ప్రశ్నలకు ‘అవును – కాదు’ అనే జవాబులు వస్తున్నాయి. ఆదివారం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో బీజేపీ ప్రబల శక్తిగా అవతరించనుందని చెప్పగా, క్షేత్ర స్థాయి నిర్మాణం లేని పార్టీకి అంతటి విజయం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.98% ఓట్లతో, ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ 4 నెలల్లో పుంజుకుని 4 సీట్లు సాధించింది. తర్వాత వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అత్యంత తక్కువ టైంలో నాటి పాలక పక్షం పక్కనే నిలబడింది. తర్వాత దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలిచి సత్తా చాటింది. మునుగోడులో ఓడినా, గెలిచినంత పనిచేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 8 సీట్లు గెలవటమే గాక తన ఓటు బ్యాంకును 14 శాతం ఓట్లు సాధించింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన 37.35% ఓట్లలో వీలున్నన్ని ఓట్లను తనవైపు మళ్లించుకుని తెలంగాణలో కాంగ్రెస్‌కు దీటైన ప్రత్యర్థి తానేననే పరిస్థితిని కల్పించేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది.
Also Read:ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ అప్డేట్.! ఎంపీ సీట్లపై కేసీఆర్ చర్చ
గత అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే, బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. ‘విజయ సంకల్ప యాత్ర’ పేరిట ఐదు యాత్రలు చేపట్టాలని కమల దళం నిర్ణయించింది. కొమురం భీమ్ యాత్ర పేరుతో ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ సెగ్మెంట్లు, శాతవాహన యాత్ర పేరుతో కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల స్థానాల్లో పార్టీ నేతలు ప్రచారానికి దిగారు. కాకతీయ యాత్ర పేరుతో ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ సీట్లలో, భాగ్యనగరి యాత్రతో భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి స్థానాల్లో, కృష్ణమ్మ యాత్ర పేరిట మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ సీట్లలో మార్చి 1 నాటికే తొలివిడత ప్రచారం పూర్తి చేశారు.బీజేపీ ఆదినుంచి తెలంగాణలో బీసీ కార్డును వాడుతోంది. ఇక్కడ 1.35 కోట్ల బీసీ ఓట్లున్నా, వారంతా ఐక్యంగా లేరనే వాస్తవాన్ని గ్రహించి, ధర్మపురి అరవింద్, ప్రొ. లక్ష్మణ్, బండి సంజయ్ వంటి మున్నూరు కాపు, ఈటల రాజేందర్ వంటి ముదిరాజ్ నేతలనూ ప్రోత్సహిస్తోంది. రాబోయే రోజుల్లో యాదవ, కురుమతో సహా మిగిలిన బీసీ కులాలను తనవైపుకు తిప్పుకోవటంతో బాటు బలమైన జాతీయవాదాన్ని చర్చలో నిలపగలిగితే రాజ్యాధికారం సాధ్యమేననే ఆలోచనలో ఆ పార్టీ ఉంది.
ఇక తెలంగాణ ఎన్నికల విషయానికి వస్తే.. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలను ఆ పార్టీ ఏ,బీ, సీ అనే కేటగిరీలుగా విభజించింది. వీటిలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, భువనగిరి, జహీరాబాద్, మెదక్ స్థానాలను ‘ఏ’ కేటగిరిలో చేర్చింది. వీటిలో మొదటి నాలుగు ఆ పార్టీ సిట్టింగ్ సీట్లు కాగా, తర్వాతి 5 సీట్లు కొత్త స్థానాలు. ఈ 9 సీట్లు ఖచ్చితంగా గెలవాలని, అందుకు అక్కడ పూర్తి అనుకూల వాతావరణం ఉందనే నిర్ధారణకు ఆ పార్టీ వచ్చింది. ఇందుకు అనుగుణంగా ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా తన ఎన్నికల, సోషల్ మీడియా వ్యూహాలను అమలు చేస్తోంది. అదే సమయంలో ఈ 9 సీట్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే వాతావరణాన్ని సృష్టించటంలో ఆ పార్టీ విజయవంతమైంది. ఈ 9 సీట్లలో 5 సీట్లను బీసీలకు, రెండు రెడ్డి సామాజిక వర్గానికి, ఒక సీటు ఆదివాసీలకు ఆ పార్టీ కేటాయించింది. సామాజిక సమీకరణాలు, నేపథ్యాలు, ఆర్థిక పరిస్థితిని కూడా ఈ స్థానాల్లో పరిగణనలోకి తీసుకున్నారు.
Also Read:ఈడీని కలిసిన రఘునందన్ రావు.. ఎందుకు?
‘బి’ కేటగిరీలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్, పెద్దపల్లి సీట్లున్నాయి. ఈ 6 సీట్లలో గట్టి పోటీ ఇవ్వటంతో బాటు గణనీయమమైన ఓట్లు సాధించటమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తోంది. వీటిలో నాగర్ కర్నూలు సీటును దళిత నేత, మాజీ ఎంపీ రాములు కుమారుడైన భరత్‌కు కేటాయించగా, హైదరాబాద్‌లో హిందూ- ముస్లిం పోలరైజేషన్‌తో బాటు జాతీయవాదాన్ని బలంగా వినిపించే మహిళను బీజేపీ రంగంలోకి దించింది. మహబూబ్ నగర్‌లో డీకే అరుణ, పెద్దపల్లిలో మాదిగ సామాజిక వర్గం ఓట్లమీద, నల్గొండ, వరంగల్ సీట్లలో వలస నేతల మీదనే ఆ పార్టీ ఆధారపడుతోంది. ఈ 5 సీట్లలో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్న అంశాన్నీ ఆ పార్టీ ఒక ప్రాతిపదికగా తీసుకుంటోంది. చివరిదైన ‘సి’ కేటగిరిలో ఖమ్మం, మహబూబాబాద్‌లలో ఆ పార్టీకి ఇప్పటికి పెద్ద ఆశలేమీ లేవు. గతంలో వామపక్ష తీవ్రవాదం గణనీయంగా ఉన్న ఈ స్థానాలపై పట్టు సాధించటానికి ఇంకా సమయం ఉందని ఆ పార్టీ భావిస్తోంది.
ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టు నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఆకర్షించి, ఆ పార్టీని ఎన్నికల క్షేత్రం నుంచి తప్పించగలిగితే కనీసం 8 సీట్లు గెలుచుకోవచ్చనీ, ఆపైన తమకు చేకూరే బలం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు దోహదపడనుందని బీజేపీ బలంగా నమ్ముతోంది.