Lok Sabha Polls: లోక్ సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. తొలి విడత ఎన్నికలకు ప్రచారం బుధవారం ముగిసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నాలుగో దశలో జరుగుతున్నాయి.
నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన విడుదల కానుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక ఎన్నికలు మే 13వ తేదీన జరుగుతాయి.
తెలంగాణలో ఇది వరకే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నాలుగో దశలో తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో తెలుగు రాష్ట్రాలతోపాటు మరో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌లో ఎంపీ ఎన్నికలు జరుగుతాయి.
Also Read: బైక్‌ను ఈడ్చుకెళ్లిన లారీ.. రెండు కిలోమీటర్లు బ్యానెట్ పట్టుకుని వేలాడిన రైడర్
ఈ నాలుగో విడతలో భాగంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు, ఏపీలో 25 ఎంపీ స్థానాలు, మహారాష్ట్రలో 11, బిహార్‌లో 5, మధ్యప్రదేశ్‌లో 8, ఉత్తరప్రదేశ్‌లో 13, ఒడిశాలో 5, పశ్చిమ బెంగాల్‌లో 8, జార్ఖండ్‌లో 3, జమ్ము కశ్మీర్‌లో 1 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇక తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి 17వ తేదీన ప్రచారం ముగిసింది. తొలి విడతలో భాగంగా 19వ తేదీన 21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ జరగనుంది.