- బీఆర్ఎస్‌కు గుండు సున్నా!
- కేసీఆర్‌కు షాకిచ్చిన తెలంగాణ ప్రజలు
- 12 సీట్లు గెలుస్తామని చెప్పి సున్నాకు పరిమితం
- అసెంబ్లీ ఎన్నికల ఓటమితో మొదలైన పరాభవం
- ఏ ఎన్నిక చూసినా భారీ షాకులే
- బీఆర్ఎస్ మనుగడ కష్టమేనా?
- పంతం నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి
- సున్నాకి పరిమితం చేస్తామని చెప్పి మరీ చేసిన సీఎం
Lok sabha 2024 elections brs not get any single seat kcr shoked:
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే కాస్త అటూ ఇటూగా వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాయి. అయితే, బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. ఎంఐఎం ఎప్పటిలాగే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ దక్కించుకుంది. 17 పార్లమెంట్ స్థానాలలో బీజేపీకి 8, కాంగ్రెస్‌కు 8, ఎంఐఎంకు ఒక స్థానం దక్కాయి. ఖమ్మం, జహీరాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నాలుగు స్థానాలను గెలవగా, దాన్ని డబుల్ చేసుకుంది. అలాగే, అప్పట్లో 3 స్థానాలే గెలిచిన కాంగ్రెస్ ఈసారి 8 చోట్ల గెలిచి సత్తా చాటింది. కానీ, బీఆర్ఎస్ మాత్రం చతికిలపడిపోయింది.
కనీస స్థాయిలో పోటీ ఇవ్వని బీఆర్ఎస్
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సాధించిన విజయంతో బీఆర్ఎస్ అగ్ర నేతలు తామేదో అద్భుత విజయం సాధించామని ఇదే విజయ పరంపర ఇకపై కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ, అదేం జరగలేదు. నిజానికి, స్థానిక ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. తాజా పరిణామాలతో భవిష్యత్తులో బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందనే చర్చ జరుగుతోంది. పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్, పతనం అంచున పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకున్న గులాబీ పార్టీ పార్లమెంట్ ఫలితాలు వచ్చే నాటికి కేవలం సింగిల్ సీటు లేక సున్నాతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితికి దిగజారిపోయింది. తాజా ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితి ఏమిటని బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే చాలామంది నేత లు ఇతర పార్టీలకు వలస వెళ్లగా, కొత్తగా మరింతమంది గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందంటున్నారు.
అలర్ట్ అయిన జంపింగ్ జపాంగ్స్
పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా ఉండబోతున్నదని ముందే ఊహించిన కొందరు నేతలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసులలో చేరిపోయారు. అలాగే, టికెట్లు కేటాయించే సీజన్ వచ్చిన తర్వాత ఎంపీ టికెట్లు ఇస్తామంటే పలువురు సీనియర్ నాయకులు మాకు వద్దంటే వద్దంటూ తిరస్కరించారు. ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని అన్నారు. కొందరైతే టికెట్ ప్రకటించిన తర్వాత కూడా నై అన్నారు. ఒకవైపు కేసీఆర్ పిలిచి మరీ టికెట్ ఇస్తానని అన్నప్పటికీ పుచ్చుకోకుండా వద్దని అన్నవారు,మరొక పార్టీలోకి గెంతి అక్కడ టికెట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే భారత రాష్ట్ర సమితి పార్లమెంటు ఎన్నికలలో ప్రభావశీలంగా ఉండగలదనే నమ్మకం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులలో పూర్తిగా సన్నగిల్లిపోయింది. వారందరి అంచనాలకు తగినట్లుగానే ఇప్పుడు ఫలితాలు వచ్చాయి.
అన్నంత పని చేసిన రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్‌ను రాష్ట్రంలో కనుమరుగు చేస్తామని శపథం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆపార్టీకి ఒక్క సీటు కూడా రానివ్వమని అన్నారు. అన్నట్టుగానే చేసి చూపించారు. గుండు సున్నాతో పరువు పోగొట్టుకుంది గులాబీ పార్టీ.