Lime For Duty, Strong Liquor Sales In The State : తెలంగాణలో లిక్కర్ సేల్స్ అంటే ఓ రేంజ్ లో జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు పాత రికార్డులను చెరిపేస్తుంటారు మందుబాబులు. కేసీఆర్ ప్రభుత్వంలో మద్యం సేల్స్ ద్వారా భారీ ఆదాయం వచ్చి పడింది. అయితే, ఇప్పుడు కూడా రాష్ట్రంలో జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. కానీ.. అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ మాత్రం రావడం లేదు. మద్యం అమ్మకాలను రికార్డుల్లో చూపించకుండా కొందరు వ్యాపారులు వ్యాట్‌ను ఎగవేస్తున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. దీనిపై ఆధారాల సేకరణకు అంతర్గత విచారణ చేయిస్తున్నట్లు సమాచారం.
టానిక్ వ్యవహారంతో అంతా వెలుగులోకి..!
కొద్ది రోజుల క్రితం టానిక్ దుకాణాల్లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఆ సోదాల్లో భారీగా వ్యాట్ ఎగవేత బయటపడింది. ఆ తీగను పట్టుకుని అధికారులు ఓ మద్యం తయారీ డిస్టిలరీపై దాడులు జరపగా డొంకంతా కదులుతోంది. అక్కడ ఏకంగా 15 లక్షల లీటర్ల అమ్మకాలు లెక్కల్లోకి రానట్లుగా తేలిందని సమాచారం. రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్‌కు చెందిన అన్ని డిస్టిలరీలు, గోదాములు, మద్యం దుకాణాల లెక్కలన్నీ పక్కాగా సేకరించి ఆడిట్ చేస్తే వందల కోట్ల అక్రమాలు బయటపడవచ్చని ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది.
లెక్కల్లో తేడాలెన్నో..?
ఈ ఏడాది రూ.19,884.90 కోట్ల ఎక్సైజ్ సుంకం వసూలవుతుందని ప్రభుత్వం భావించింది. జనవరి నాటికే రూ.17,964.26 కోట్లు వచ్చినట్లు కాగ్ తాజాగా వెల్లడించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 జనవరి వరకు రూ.14,598.66 కోట్లు వచ్చాయి. ఈ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 23 శాతం పెరిగినట్లు. కానీ, ఇదే నిష్పత్తిలో వ్యాట్ పెరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గత ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు వ్యాట్ వసూళ్లు రూ.13,332 కోట్లుగా ఉన్నాయి. 2022-23లో అదే 11 నెలల్లో రూ.12,922 కోట్ల వ్యాట్ ప్రభుత్వానికి వచ్చింది. అంటే, ఈ ఏడాది అదనంగా పెరిగిన ఆదాయం కేవలం రూ.410 కోట్లు మాత్రమే.
వే బిల్లులతో స్కామ్‌కు శ్రీకారం
తొలుత రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్‌కు చెందిన డిస్టిలరీ నుంచి గోదాముకు మద్యం తరలిస్తారు. తర్వాత అక్కడి నుంచి దుకాణానికి తీసుకెళ్తారు. డిస్టిలరీ నుంచి వెళ్లేటప్పుడే దాని విలువెంత, వ్యాట్ ఎంత రావాలనే పక్కా లెక్కతో ఈ-వే బిల్లు జారీ చేసి ఆన్ లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఇక దాన్ని ఎక్కడ అమ్మినా వ్యాట్ సొమ్ము ప్రభుత్వానికి చేరుతుంది. కానీ, వే బిల్లుపై వ్యాట్ వివరాలు లేకుండా పంపుతూ లక్షలాది లీటర్లపై వ్యాట్ ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు, నేతలు, వ్యాపారులు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టానిక్‌లో ఇదేవిధంగా లక్షలాది లీటర్లకు వ్యాట్ చెల్లించలేదని తేలింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా లోతుగా విచారిస్తే భారీగా అక్రమాలు బయటపడతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.