- జనగామ జిల్లాలో దారుణం
- భూమి రిజిస్ట్రేషన్ కాలేదని రైతు ఆత్మహత్య
- రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్న అధికారులు
- అప్పు చేసి 4 లక్షలు ఇచ్చిన అన్నదాత
- అయినా, పని కాకపోవడంతో సూసైడ్
Lie In The Name Of Farmer Encroachment And Bribes : రైతే రాజు, దేశానికి వెన్నెముక, రైతు రాజ్యం, ఇలా వాట్సాప్‌లో స్టేటస్‌లు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు కొందరు. మరికొందరు అప్పుడప్పుడన్నా వారి గురించి ఆలోచిస్తారు. కానీ, దేశంలో రైతులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవాలంటే నానా యాతన పడాలి. మధ్యలో దళారుల దౌర్జనం మామూలే. ప్రభుత్వాలు పకడ్బందీగా అన్నీ చేస్తున్నామని చెబుతున్నా, కిందిస్థాయిలో అధికారులు కొందరు చేతివాటం ప్రదర్శిస్తుండడం కామన్ అయిపోయింది. ఇంతేనా, పాస్ బుక్ కావాలన్నా, రిజిస్ట్రేషన్ చేయాలన్నా లంచం వేధింపులతో అన్నదాత అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చివరకు భరించలేక తనువు చాలిస్తున్న పరిస్థితి.
తాజాగా జనగామ జిల్లాలో ఓ ఘటన వెలుగు చూసింది. భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకున్న అధికారులు ముఖం చాటేయడంతో చేసేదేం లేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పడమటి కేశవాపురం గ్రామానికి చెందిన రైతు రఘుపతి. ఇతనికి చెందిన ఎకరం భూమి రిజిస్ట్రేషన్ కోసం రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీనికోసం సంబంధిత అధికారులను సంప్రదిస్తే లంచం డిమాండ్ చేశారు. అప్పు చేసి మరీ రఘుపతి ఆ సొమ్మును చెల్లించాడు. కానీ, పని జరగలేదు. ఏళ్లు గడుస్తున్నాయే గానీ రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు. రెండేళ్లు తిప్పించుకున్న అధికారులు ముఖం చాటేశారు. ‘‘నా పనైనా చేయండి, అప్పు తెచ్చి లంచంగా ఇచ్చిన డబ్బులైనా తిరిగి ఇవ్వండి సారూ’’ అంటూ ఆ రైతు వేడుకున్నా, తహసీల్దారు కార్యాలయంలోని ఆ కర్కోటకుల మనసు కరగలేదు.
Read Also : అవినీతి అనకొండ.. టీడీఆర్ స్కాంలోనూ శివబాలకృష్ణ లీలలు
లంచం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేది లేదని కరాఖండీగా చెప్పేశారు. ఓవైపు భూమి రిజిస్ట్రేషన్ కాలేదు, ఇంకోవైపు అప్పు తెచ్చిన డబ్బుకు వడ్డీ పెరుగుతోంది. ఏం చేయాలి భగవంతుడా అనుకుంటూ ఆ బాధలో తీవ్ర మనస్థాపానికి గురైన రఘుపతి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బచ్చన్నపేట మండల తహసీల్దారు కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్ కలిసి 4 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టు బాధిత రైతు కుటుంబ సభ్యులు అంటున్నారు. రెండేళ్లు తిరిగినా పని చేయకపోవడంతో అదే పొలం దగ్గర ఉరేసుకుని రఘుపతి చనిపోయాడని తెలిపారు. తన చావుకు వాళ్లే కారణం అంటూ బంధువులు మృతదేహంతో బచ్చన్నపేట తహసీల్దారు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.