Let’s Hold On For The Ballot Election:భారతేదేశంలో సార్వత్రిక ఎన్నికలు ఈవీఎం విధానంలో జరుగుతున్నాయి. పారదర్శకంగా ఉండే బ్యాలెట్ ఎన్నిక ఫలితాలు ఆలస్యం కారణంగా చూపుతూ, 2004 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని లోక్ సభ స్థానాలకు ఈవీఎంల ఓటింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. నిజానికి, ఈవీఎంల ప్రస్థానం 1982లోనే మొదలైంది. కేరళలోని పరూర్ అసెంబ్లీ స్థానానికి అప్పట్లో తొలిసారి ఈవీఎంను వాడారు. తర్వాత ఈ విధానంపై ఆరోపణలు రావడంతో 1989లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 61-ఏ ని చేర్చింది కేంద్రం. 1998లో మూడు రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంలతో ఎన్నిక జరిగింది. అలాగే, 1999లో 45 లోక్ సభ స్థానాలకు వినియోగించారు. అలా ట్రయల్ రన్‌గా అప్పటిదాకా సాగిన ఈ విధానం, 2004లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
మొన్నటి ఎన్నికలపై అనుమానాలు
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతలు, తాము ప్రజలకు ఎంతో మేలు చేశామని, 40 శాతానికి పైగా ఓటింగ్ సాధించామని, అయినా, 11 సీట్లే రావడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ఫలితాలపై మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా, పేపర్ బ్యాలెట్‌తోనే జరుగుతున్నాయన్నారు. మనం కూడా ఆ దిశగానే పయనించాలని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర నేతలు కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈవీఎంల పని తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇండియాలో రాజకీయ మంట రాజేసిన ఎలాన్ మస్క్
వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆమధ్య ట్విట్టర్‌లో ఈవీఎంలపై ఓ ట్వీట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశముందని అన్నారు. అదికూడా మన దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే ఈ ట్వీట్ చేయడంతో రాజకీయ వివాదం చెలరేగింది. ప్రతిపక్ష నేతలు బీజేపీని టార్గెట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేసి ఉంటారని అన్నారు. బీజేపీ నేతలు మస్క్ తీరుపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. దమ్ముంటే ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలని సవాళ్లు విసిరారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈవీఎంల పనితీరుపై అనుమానాలున్నాయన్నారు. పారదర్శకత ఉండేలా చూడాలని, లేని పక్షంలో వీటి వాడకాన్ని నిలిపివేయాలని సూచించారు. ఈవీఎంలు బ్లాక్ బాక్సులు వంటివని వ్యాఖ్యానించారు. కానీ, ఎన్నికల సంఘం మాత్రం ఇది తప్పని అంటోంది. ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయలేరని చెబుతోంది. ఏం చేసినా ఫిజికల్‌గానే చేయాలని చెబుతోంది. అయినా, ఎన్నో అనుమానాలు ఉన్నాయి.
వయనాడ్ ఉప ఎన్నిక బ్యాలెట్‌తో నిర్వహించాలి
ఈవీఎంల పనితీరుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో వయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. అలాగే, రాయ్ బరేలి నుంచి కూడా గెలుపొందారు. దీంతో వయనాడ్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలనే డిమాండ్ వినిపిద్దాం. రాహూల్ గాంధీ సహా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, కూటమి నేతలు, బాధ్యతగల ప్రజా సంఘాలు, సమూహాలు, సమాజాలతో పాటు ఉద్యమ సంఘాలు, సంస్ధలు, ఇతర శక్తులు భారీఎత్తున దీనికోసం పట్టుబట్టాలి. డిమాండ్ చేయాలి. అవసరమైతే పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో, పద్ధతులలో ఎంతకైనా తెగించాలి. అదీ లేదంటే, ఈ ఎన్నిక సహా సమీప భవిష్యత్తులో జరిగే అన్ని రకాల ఎన్నికలను మూకుమ్మడిగా బహిష్కరిస్తూ పోవాలి. అప్పుడు ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు భారత్ వైపు చూసేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా బాధ్యతగల భారత పౌరులు సహా దేశంలోని ఈవీఎం వ్యతిరేక రాజకీయ పార్టీలకు, పౌర సమూహాలకు, సమాజాలకు, ఉద్యమ సంఘాలకు, శక్తులకు ఈ సందర్భంగా నిర్మాణాత్మకమైన సూచన చేస్తున్నా. కనీసం పనికైనా పూనుకొమ్మని ఎంతో వినయంగా, వినమ్రంగా, హుందాగా, గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నా. రండి, కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికను బ్యాలెట్‌తో జరిపేలా కేంద్ర ఎన్నికల సంఘంని డిమాండ్ చేద్దాం. ఈ చారిత్రక ప్రతిపాదనను తిరస్కరిస్తే, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, రాజకీయ పార్టీలు సదరు ఎన్నికను మూకుమ్మడిగా బహిష్కరించేలా పిలుపునిద్దాం. తక్షణమే ఈ పనికి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పూనుకొనేలా వ్యూహాత్మకంగా ఒత్తిడి చేద్దాం.
-సంగటి మనోహర్ మహాజన్ వ్యవస్థాపక జాతీయ కన్వీనర్, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి