Let’s Develop Eco Tourism : తెలంగాణలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అటవీ శాఖామంత్రి కొండా సురేఖ, ఉన్నత స్థాయి అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో అటవీ శాఖ, పర్యాటక శాఖలు పూర్తి సమన్వయంతో పని చేయాలని, సంయుక్తంగా పర్యాటక ప్రాజెక్టుల ప్రతిపాదనలతో ముందుకు రావాలని సూచించారు. తెలంగాణలో పర్యాటకులను ఆకర్షించే వైవిధ్యమున్న ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. జీవ వైవిధ్యమున్న అటవీ ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలను గుర్తించి, వాటికి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు.
ఎకో టూరిజం ప్రాజెక్టులకు అవసరమైతే కన్సల్టెంట్స్‌ను నియమించాలనీ, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వన్యప్రాణులకు హాని కలిగించకుండా పర్యాటక విధానం ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లోనే పర్యాటకులు విడిది చేసేలా ఉన్న వేరే రాష్ట్రాల ప్రాజెక్టులనూ అధ్యయనం చేసి, అక్కడ అనుసరిస్తున్న రక్షణ, భద్రత చర్యలను రాష్ట్రంలోనూ అమలయ్యేలా చూడాలని చెప్పారు. అటవీ శాఖ నుంచి వేరే శాఖలకు డిప్యుటేషన్ మీద వెళ్లిన ఉద్యోగుల గురించి ఆరా తీసిన సీఎం, అవసరమైతే వారిని తిరిగి వెనక్కి రప్పిస్తామన్నారు. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న అటవీ శాఖ ఉద్యోగుల బదిలీకి మార్గం సుగమం చేసేలా బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని అధికారులు కోరగా, లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిశాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒకేచోట చాలాకాలంగా పాతుకు పోయిన ఉద్యోగుల బదిలీలకూ మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Read More: మైనింగ్ ఫైటింగ్, ఎమ్మెల్యే తమ్ముడి అరెస్ట్
కాలుష్య నిబంధనలు, ప్రమాణాలను పాటించే పరిశ్రమలకు ఏటా పర్యావరణ దినోత్సవం రోజున జీరో పొల్యూషన్‌ను విడుదల చేసే సంస్థలకు ప్రశంసా పత్రాలివ్వాలన్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేందుకు నిబంధనలను అతిక్రమించే ప్లాస్టిక్ తయారీ యూనిట్లకు నోటీసులిచ్చి, భారీగా జరిమానాలు విధించాలని చెప్పారు.
తెలంగాణకు మంజూరైన 81 మంది ఐఎఫ్ఎస్ పోస్టుల్లో 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సరిపడా అధికారులను కేటాయించాలని కోరుతూ కేంద్రాన్ని కోరుదామని సీఎం తెలిపారు. వచ్చే వానాకాలంలో రాష్ట్రంలోని నర్సరీల్లో అందుబాటులో ఉన్న 22 కోట్ల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేయాలని, అడవుల్లో చెట్ల నరికిన చోట వీటిని నాటేలా చూడాలని, అవసరమైతే అక్కడే బోర్లు వేయించైనా అవి బతికేలా చూడాలని సీఎం సూచించారు. అటవీ భూముల ఆక్రమణను ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి, కేంద్రం నుంచి వచ్చే కాంపా నిధుల వినియోగం మీద సీఎం అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం కార్యదర్శి చంద్ర శేఖర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.