– కాంగ్రెస్‌లో చేరతామని తెగ పోటీపడుతున్నారు
– పార్టీలోకి ఎవరైనా రావొచ్చు
– ఎన్నికల ముందు వెళ్లిన వాళ్లను కూడా ఆహ్వానిస్తున్నాం
– తెలంగాణ నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తాం
– రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం
– పదేళ్లలో దేశాన్ని మోడీ ఆగం చేశారన్న జగ్గారెడ్డి
హైదరాబాద్, స్వేచ్ఛ: కాంగ్రెస్‌లోకి ఎవరొచ్చినా తీసుకుంటామని గేట్లు తెరిచారు ఆ పార్టీ నేతలు. గురువారం వరంగల్ మేయర్ గుండు సుధారాణి సహా పలువురు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో చేరతామని చాలామంది ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఏఏసీసీకి వరుసగా లేఖలు రాస్తున్నారని, రెండు రోజులు గాంధీ భవన్‌లో చేరికలు ఉంటాయి, ఎవరొచ్చినా జాయిన్ చేసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సభలు ఉంటాయని చెప్పారు. మే 1 నుండి తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలవుతాయని తెలిపారు జగ్గారెడ్డి. మోడీ ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకురావడం వల్ల ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. మోడీ నాలుగు వందల సీట్లు గెలుస్తామని చెబుతున్నారని, అది జరగని పని అంటూ విమర్శలు చేశారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ 4వేల కిలో మీటర్లు భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర చేపట్టారని తెలిపారు. బీజేపీ చేసిన నయవంచన పేరుతో కాంగ్రెస్ పార్టీ ఛార్జ్‌షీట్ విడుదల చేసిందన్నారు జగ్గారెడ్డి. నెహ్రూ, అంబేద్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోడీ తీసివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈసారి మోడీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తి వేస్తారని జోస్యం చెప్పారు. 14 పార్లమెంట్ సీట్లు గెలిపించాలని తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేశారు జగ్గారెడ్డి. దేశానికి రాహుల్ ప్రధాని కావాలంటే తెలంగాణ నుండి 14, 15 మంది ఎంపీలు గెలవాలని చెప్పారు. రాహుల్ ప్రధాని అయితే హామీలన్నీ నెరవేరుస్తారని, పదేళ్ల పాటు దేశాన్ని మోడీ ఆగం చేశారని విమర్శించారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రతి నిరుపేద కుటుంబానికి నల్లధనం తీసుకొచ్చి జన్ ధన్ అకౌంట్‌లో 15 లక్షలు వేస్తామన్నారు, ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులను మోసం చేశారని, పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని జగ్గారెడ్డి నిలదీశారు.