– కార్మికులు బాగుంటేనే సింగరేణి బాగుంటుంది
– సింగరేణి బాగుంటేనే దేశం బాగుంటుంది
– వంశీకృష్ణను గెలిపించాలని కోరిన వివేక్
– కాళేశ్వరం పేరుతో దోపిడీ చేసిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని పిలుపు
పెద్దపల్లి, స్వేచ్ఛ: కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడి కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రామగుండం ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. దీనికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, కార్మికులకు పెన్షన్ స్కీమ్ అమలు చేసిన నాయకులు కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాన్ని ఇప్పించి కాపాడారని వివరించారు. సంస్థలో 24 వేల ఉద్యోగులు పోగొట్టిన బీఆర్ఎస్ తరఫున కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారని, మంత్రిగా ఉన్నప్పుడే ఆయన కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు, ఇప్పుడేం చేస్తారని అన్నారు. వంశీని పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని కోరారు.
మా తాత ఎప్పుడూ చెబుతుండేవారు..
వంశీకృష్ణ మాట్లాడుతూ, కార్మికులు బాగుంటేనే సంస్థ బాగుంటుందన్నారు. సింగరేణి బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇది తన తాత కాకా వెంకటస్వామి ఎప్పుడూ చెప్తుండేవారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి కార్మిక వర్గానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్యం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన, ఎంపీగా అవకాశం కల్పిస్తే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.