Kyrgyzstan living indian students warns not coming outside due to violence:
కిర్గిజ్‌స్థాన్ నుంచి భారత విద్యార్థులను అప్రమత్తం చేసింది భారత ప్రభుత్వం. అక్కడ విద్యను అభ్యసిస్తున్న భారత యువకులను ఎవరూ కూడా బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. విదేశీ విద్యార్థులను టార్గెట్ చేసుకుని బిష్కెక్ లో అల్లరి మూకలు తెగబడుతున్నారు. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
టచ్ లోనే ఉన్నాం
‘‘మేము మా దేశ విద్యార్థులతో నిరంతరం టచ్ లో ఉన్నాం. వారి గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతానికి అక్కడి పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. అయినప్పటికీ విద్యార్థులెవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నాం. ఏదైనా ఎమర్జెన్స సహాయం కావలసి వస్తే వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరుతున్నాం’’ అంటూ తమ కాంటాక్ట్ నంబర్ ఇచ్చి 24 గంటలూ అందుబాటులో ఉంటాం అని ట్వీట్ చేసింది. అలాగే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా కిర్గిజ్‌స్థాన్ అల్లర్లపై స్పందించారు. బిష్కెట్ లో నివసిస్తున్న భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎంబసీ తో విద్యార్థులంతా టచ్ లో ఉండాలని సూచించారు.
విద్యార్థులే లక్ష్యంగా టార్గెట్
ఇదిలావుండగా.. కిర్గిజ్‌స్థాన్, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య మే 13న ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం.. దాడులకు దారితీసినట్లు ఎంబసీ తెలిపింది. అనంతరం కొన్ని అల్లరి మూకలు బిష్కెక్‌లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ మూక హింసలో.. పాకిస్తాన్‌కు చెందిన పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయని కిర్గిజ్‌స్థాన్‌లోని పాక్ ఎంబసీ ఎక్స్ వేదికగా తెలిపింది. అంతేకాదు.. ముగ్గురు పాక్ విద్యార్థులు మృతి చెందారన్న వార్తలూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే.. దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు.