– ఫోన్ ట్యాపింగ్‌లో కేటీఆర్ లింకులు
– వరుసబెట్టి కాంగ్రెస్ నేతల విమర్శలు
– హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలు
– తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోనన్న కేటీఆర్
– లీగల్ చిక్కులు తప్పవంటూ హెచ్చరిక
– డ్రామాలొద్దని హస్తం నేతల కౌంటర్
– తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం
– సుప్రీమో ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగిందంటున్న రాధా కిషన్ రావు
– ఎవరా సుప్రీమో.. కేసీఆరా? లేక, కేటీఆరా?
– ట్యాపింగ్ సీన్‌లోకి చికోటి ప్రవీణ్
Phone Tapping : తెలంగాణలో ప్రజెంట్ మోస్ట్ ఇంట్రస్టింగ్ టాపిక్ ఏదన్నా ఉందంటే అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే. తవ్వేకొద్దీ ఇందులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటిదాకా అధికారులనే టచ్ చేసిన ఈ కేసులో త్వరలోనే గులాబీ నేతల గుట్టు బయటపడనుందనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు కేసులో అరెస్ట్ అయిన రాధా కిషన్ రావు, సుప్రీమో ఆదేశాలతో తాము అంతా చేశామని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఆ సుప్రీమో ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. కొందరు కేసీఆర్ అంటుంటే, మరికొందరు కేటీఆర్ పనిగా చెబుతున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
కేటీఆర్ ట్వీట్‌తో హీట్
సంచలనం రేపుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు ఇతర పార్టీల నేతలు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. తనపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై కోర్టుకెళ్తానని అన్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై న్యాయపరంగానే ముందుకెళ్తానని స్పష్టం చేశారు కేటీఆర్.
కాంగ్రెస్ నేతల కౌంటర్లు
కేటీఆర్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. కవిత మాదిరే ఆయన కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందేనని సెటైర్లు వేస్తున్నారు. హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసిన కేటీఆర్ తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు మంత్రి కొండా సురేఖ. చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. అరెస్టు అయిన అధికారులు అందురూ కేటీఆర్, కేసీఆర్ చెయ్యమంటే చేశామని అంటున్నారని గుర్తు చేశారు. అయినా కూడా, కాంగ్రెస్ నేతలపై మీడియాపై కేటీఆర్ నోరు జారుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో ఆయన పేరు వస్తుందనే భయంతోనే లీగల్ నోటీస్ ఇస్తామంటూ బెదిరిస్తున్నారని, దీనికి బయపడే వారు ఇక్కడ ఎవరూ లేరని స్పష్టం చేశారు సామా రామ్మోహన్ రెడ్డి. పోలీసుల రూపంలో ప్రైవేట్ సైన్యాన్ని కేసీఆర్, కేటీఆర్ పెంచి పోషించారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గుట్టంతా బయటపడ్డాక కూడా కేటీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు. లీగల్ నోటీసులు అంటూ డ్రామా చేస్తున్నారన్న ఆయన, తాము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్లు ట్యాప్ చేయడం దేశద్రోహం కిందకు వస్తుందని తెలిపారు. కేటీఆర్ ప్రవర్తన వల్ల రాష్ట్ర పరువు పోయిందని, పరువు నష్టం దావా వేసే నైతిక హక్కు ఆయనకు లేదని అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ఇక, తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేటీఆర్ వార్నింగ్ పైనా స్పందించారు. ఆయన తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. కేటీఆర్ ఏ నోటీసులిచ్చినా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయినా, పరువున్నోడే దాని గురించి మాట్లాడాలని, కేటీఆర్ లేదనే తాము అనుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌కు తెలియకుండానే జరిగిందా..?
ఫోన్ ట్యాపింగ్ అంశం తనకేం తెలియదన్నట్టుగా నోటీసులు పంపుతానని అంటున్నారు కేటీఆర్. నిజానికి ట్యాపింగ్ జరిగిందని ఆయనే ఒప్పుకున్నారు. ఈమధ్య ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ, ఒకరిద్దరివి ట్యాప్ చేసి ఉండొచ్చని అన్నారు. స్వయంగా ఆయనే ఇలా మాట్లాడడంతో కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచారు. కేసీఆర్, కేటీఆర్‌ను కాదని అధికారులు ఇంత సాహసానికి ప్రయత్నించరని గట్టిగా వాదిస్తున్నారు. న్యాయ పోరాటం అంటూ డ్రామా క్రియేట్ చేస్తున్నారని, టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కేటీఆర్ తప్పించుకోలేరని చెబుతున్నారు.
చికోటి ప్రవీణ్ ఎంట్రీ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోకి వివాదాస్పద బీజేపీ లీడర్ చికోటి ప్రవీణ్ ఎంట్రీ ఇచ్చారు. రాధా కిషన్ రావు తనపై కక్ష గట్టి చేసిన పనులన్నీ వివరించారు. ఆయన ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అసలు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముందని, డీజీపీకి రాధా కిషన్ రావుపై ఫిర్యాదు చేశారు చికోటి. ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయని, తన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు చెప్పారు. పీడీ యాక్టులు పెడతామనని తనను బెదిరించారన్నారు చికోటి ప్రవీణ్.