Kishan Reddy: ప్రధాని మోదీపై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఒక్క వరంగల్ జిల్లాకు రూ. 10 లక్షల కోట్లు ఇచ్చారా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన కేటీఆర్.. ఉత్తుత్తి 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలాగానే ఉందిది అంటూ సెటైర్లు వేశారు. ప్రధాని ప్రకటన తప్ప.. ప్రజలకు ఒక్క పైసా రాలేదని మండిపడ్డారు.
బీజేపీ హయాంలోనే రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కిందని, రూ. 500 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టిందని కిషన్ రెడ్డి శనివారం వరంగల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, రైల్వే వ్యాగన్ కోచ్ నిర్మాణానికి శరవేగంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని వివరించారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇది కేవలం ప్రధాని ప్రకటన తప్పా ప్రజలకు ఒక్క పైసా రాలేదని కేటీఆర్ కౌంటర్ వేశారు.
Also Read: రేపు ఐదో విడత పోలింగ్.. వివరాలు ఇవే
కేటీఆర్ ఆదివారం భువనగిరిలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రలు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన భువనగిరికి వెళ్లారు. తమ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డిని గెలిపించాలని, ప్రశ్నించే గొంతుకను చట్టసభకి పంపాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. అలాగే, రాకేశ్ రెడ్డికి మద్దతుగా ఆలేరులో జరిగిన సన్నాహాక సమావేశంలోనూ కేటీఆర్ ప్రసంగించి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.