Rahul Gandhi: తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ సూపర్ హిట్ అయింది. ఎన్నికల ముందు ఈ సభకు విశేష స్పందన రావడంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఈ సభలో ప్రకటించిన హామీలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఎక్స్ వేదికగా నిలదీశారు.
అది జనజాతర సభ కాదని, హామీల పాతర, అబద్ధాల జాతర సభ అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల గారడి చేసిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ న్యాయ్ పేరిట నయా నాటకాలకు తెరతీశారని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేసి ఇప్పుడు న్యాయ్ అంటే నమ్మేదెవరు? అని ప్రశ్నించారు. నమ్మి ఓటు వేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలల్లోనే నయవంచన చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే సాగునీరు అందడం లేదని, ఫలితంగా రైతన్నల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని, నేతన్నల బలవన్మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని ఆరోపణలు గుప్పించారు. అన్నదాతల ఆర్థనాదాలు వినపడటం లేదా? రాహుల్ గారూ.. అంటూ నిలదీశారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ ఊసెత్తని ప్రభుత్వాన్ని నిలదీయరా? అని అడిగారు.
Also Read: ఆర్జీవీ డైలాగ్ కాపీ కొడుతున్న తెలుగు ముఖ్యమంత్రులు జగన్, రేవంత్ రెడ్డి
75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వెనుకబడి ఉన్నారంటే అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్సే అని కేటీఆర్ ఆరోపించారు. అలాంటిది ఇప్పుడు అదే పార్టీ కొత్తగా కులగణన పల్లవి అందుకున్నదని, కానీ, ఈ కొత్త పల్లవికి ఓట్లు రాలవని పేర్కొన్నారు. చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని రాష్ట్ర ప్రజలకు అర్థమైందని, వందరోజుల్లోనే హామీలను కాంగ్రెస్ బొందపెట్టిందని గుర్తెరుగుతున్నదని, కాబట్టి, వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం ఖాయంగా చెబుతారని ట్వీట్ చేశారు.