– జాబ్ క్యాలెండర్ అన్నారు.. అతీగతీ లేదు
– నిరుద్యోగ భృతి అన్నారు.. మాట తప్పారు
– మెగా డీఎస్సీ అన్నారు.. 11 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చారు
– ఎంట్రన్స్ ఎగ్జామ్‌లకు జీరో ఫీజు అని చెప్పారు.. భారీగా పెంచేశారు
– ఇదేనా ప్రజా పాలన అంటే?
– దమ్ముంటే భర్తీ చేశామంటున్న 32వేల ఉద్యోగాల నోటిఫికేషన్ల తేదీలు బయటపెట్టాలి
– కాంగ్రెస్ సర్కార్‌కు కేటీఆర్ సవాల్
KTR Press Meet At Telangana Bhavan: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలే అయింది. కానీ, విమర్శల దాడిలో బీఆర్ఎస్ దేన్నీ వదలడం లేదు. ఇచ్చిన హామీలు, చేస్తున్న పనులు, ఇలా అన్నింటిలోనూ వీలు చిక్కినప్పుడల్లా టార్గెట్ చేస్తోంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు.
కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. పదేళ్లు మాత్రమే తామున్నామని, అంతకుముందు పదేండ్లు కాంగ్రెస్ పాలించిందని తెలిపారు. ఆ పదేండ్లలో 24,086 పోస్టులనే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేశారని చెప్పారు. వాటిలో తెలంగాణకు దక్కింది 10,084 ఉద్యోగాలేనని వివరించారు. ‘‘2,32,308 ఉద్యోగాలకు కేసీఆర్ అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇచ్చారు. ఇందులో 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.
1,60,083 పోస్టులు భర్తీ అయ్యాయి. మిగిలినవి అండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి. ఈలోపే ప్రభుత్వం మారింది. 32 వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. వాళ్లకు దమ్ముంటే నోటిఫికేషన్ ఇచ్చిన తేదీలను చెప్పాలి. ఆ 32 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్షలు పెట్టింది మేమే. కేవలం రిజల్ట్ ఇచ్చి, ఉద్యోగాలు తామే భర్తీ చేసినట్టుగా కాంగ్రెస్ చెప్పుకుంటోంది’’ అంటూ మండిపడ్డారు. పోలీస్ ఉద్యోగాల రిజల్ట్ కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఇచ్చిందని, ఈ విషయాల్ని యువతకు సరిగ్గా చెప్పుకోలేకపోయామని అన్నారు కేటీఆర్.
ప్రైవేట్ రంగంలో 24 వేల పరిశ్రమలకు పర్మిషన్ ఇచ్చామని, 24 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఇంతకంటే ఎక్కువ నియామకాలు చేపట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు చూపించాలని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ చూపిస్తే తాను తక్షణమే రాజీనామా చేస్తానని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అన్నీ మోసాలే జరుగుతున్నాయని విమర్శించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు.
‘‘మెగా డీఎస్సీ అన్నారు. 11 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అతీగతీ లేదు. నిరుద్యోగ భృతి హామీపై మాట తప్పారు. ఎంట్రన్స్ ఎగ్జామ్‌లకు జీరో ఫీజు అన్నారు. టెట్ ఫీజును 400 నుంచి, 2 వేలకు పెంచారు. ఫార్మా సిటీతో 5 లక్షల ఉద్యోగాలకు మేము రంగం సిద్ధం చేస్తే, అది రద్దు చేసి రియల్ ఎస్టేట్ చేస్తా అంటున్నారు. వీళ్ల ట్యాక్సులతో వ్యవస్థ కుదేలవుతున్నది. పెట్టుబడులు వెనక్కు పోతున్నాయి. కేన్స్ టెక్నాలజీని పట్టుకొచ్చి వారం రోజుల్లో వారికి ల్యాండ్ ఇచ్చాం. 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి. కాంగ్రెస్ వచ్చాక వెనక్కి వెళ్లిపోయింది. నల్గొండ, వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా మేము ఐటీని తీసుకెళ్లాం. ఇప్పుడు వరంగల్‌లో ఐటీ మూతపడుతున్నది. ఐటీ ఎగుమతులు తగ్గాయి’’ అంటూ విమర్శలు చేశారు. కోమటిరెడ్డి మరో కేఏ పాల్ మాదిరి అయ్యారని, ఆయన మంత్రా? జోకరా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం విషయంలో కాపర్ డ్యామ్ కట్టుమంటే ముందు వినలేదని, ఇప్పుడు అక్కడికే వచ్చారు అంటూ కేటీఆర్ మండిపడ్డారు.