Teenmar Mallanna: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై విరుచుకుపడ్డారు. తీన్మార్ మల్లన్న మీడియాను అడ్డుకుపెట్టుకునే బెదిరించే ఒక బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో.. ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదని అన్నారు. ఒకప్పుడు నల్లగొండలో నయీం ఉండేవారని, ఇప్పుడు చట్టసభల్లో అవకాశం ఇస్తే తీన్మార్ మల్లన్నను కూడా అలా తయారు చేసినట్టు అవుతుందని చెప్పారు. కాబట్టి, విద్యావంతుడు, ప్రశ్నించే సత్తా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్‌లో బుధవారం సమీక్ష చేశారు. పార్టీ నాయకులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో అకాల వర్షంతో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ధాన్యం తడిసిపోయి.. మార్కెట్‌కు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా జాప్యం చేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కామారెడ్డి, సిరిసిల్ల, యాదాద్రి భువనగరి వంటి జిల్లాల్లో రైతులు నిరసనలకూ దిగుతున్నారని వివరించారు. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇకనైన రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలని, వారి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల తరఫున బీఆర్ఎస్ ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.
Also Read: Telangana: ‘పట్టం’ ఎవరికో?
ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకున్నామని, ఇక్కడ బీఆర్ఎస్ నాలుగు సార్లు గెలిచిందని కేటీఆర్ తెలిపారు. అధికార స్వరాలు అక్కర్లేదని, నిరసన స్వరాలు, ప్రశ్నించే స్వరాలు నేడు అవసరం అని, అందుకే రాకేశ్ రెడ్డికి విద్యావంతులంతా మద్దతుగా నిలువాలని సూచించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలంటే ప్రశ్నించే గొంతుకలు ఉండాలని వివరించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు నమ్మొద్దని, మెగా డీఎస్సీ కాస్తా దగా డీఎస్సీ అయిందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే నల్లగొండ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు.
ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా అశోక అకాడమీ అధినేత అశోక్, ఈడా శేషగిరి సహా మొత్తం 52 మంది బరిలో ఉన్నారు.