Phone Tapping Case: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. పోలీసుల అదుపులో ఉన్న రాధాకిషన్ రావు చెప్పిన వివరాలు సంచలనంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ సుప్రీం లీడర్ ఆదేశాలతోనే అన్నీ చేశామన్న వ్యాఖ్య రాజకీయంగా దుమారం రేపుతున్నది. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీపై, మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలకు పదునుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు. తొలిసారి క్యాజువల్‌గా కామెంట్ చేసినా.. ఇప్పుడు మాత్రం మంత్రికి వార్నింగ్ ఇచ్చారు. ఓ పేపర్ క్లిప్పింగ్ జత చేసి.. తాను కోర్టుకు ఎక్కుతానని అన్నారు. పరువునష్టం దావా వేసి లీగల్ నోటీసులు పంపిస్తానని పేర్కొన్నారు.
తన ఫోన్ ట్యాప్ చేయాలని కేటీఆర్ ఆదేశించాడని ఆరోపిస్తూ సిరిసిల్లకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కే మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మంత్రి కొండా సురేఖ కూడా కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఓ నటిని బెదిరించాడని, ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ రెండు వార్తల క్లిప్‌ను కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు తన పరువునష్ట పరిచినందుకు లీగల్ నోలీసులు పంపిస్తాను అని ట్వీట్ చేశారు. ‘ఈ నిరాధార ఆరోపణలు, అర్థరహిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలైనా చెప్పాలి. లేదంటే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాలి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే… నిజానిజాలను నిర్దారించుకోకుండా అనవసర చెత్తంతా ప్రచురితం చేస్తున్న మీడియా సంస్థలకూ లీగల్ నోటీసులు పంపుతానని హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై కేటీఆర్ తొలిసారి ఓ సభలో స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. చేస్తే ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చని, తప్పుడు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసే పని పోలీసులది అంటూ కామెంట్ చేశారు. అంతేగానీ, పది లక్షల ఫోన్లు ట్యాప్ చేశారని కొందరు రాస్తున్నారని పేర్కొన్నారు.