– ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు
– ఈ ఆలస్యానికి ప్రభుత్వమే కారణం
– బోనస్ పేరుతోనూ మాయ చేస్తోంది
– రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాను పిలవడం ఏంటి?
– ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్
Paddy: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, బోనస్ అంశంలో రాజకీయ మంటలు కొనసాగుతున్నాయి. నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతులను నిలువునా మోసం చేసిందని, రుణమాఫీ చేస్తానని, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని దగా చేసిందని విమర్శించారు.
వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహించారు. కనీస మద్దతు ధర ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ వడ్లైనా కొనడానికి సిద్ధంగా ఉన్నదని, రైతులకు కేంద్ర సహాయ సహకారాలు అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తున్నదని ఆరోపించారు. అకాల వర్షంతో ధాన్యం తడిసిముద్దవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. బుధవారం కేవలం 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం వహిస్తున్నదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
‘మొన్నటిదాకా కేబినెట్ భేటీ అని అన్నారు. ఇప్పుడు భేటీ అయినా ధాన్యం కొనుగోళ్లు నత్తనడకనే సాగుతున్నాయి. ధాన్యం కొనుగోలుకు అయ్యే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వానిదే. అయినా ప్రభుత్వం ఎందుకు రైతులను మోసం చేస్తున్నది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదో ప్రజలకు చెప్పాలి’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటే రూ.1000 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టులో రుణాలు ఇస్తామని చెబుతున్నారని, కానీ, సాగు జూన్ నెలలోనే మొదలవుతుంది కదా అని అడిగారు. అలాంటప్పుడు రైతులు రుణాలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట మారుస్తున్నదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీతో సంతకం పెట్టిన లెటర్ ఇంటింటికి పంపించారని, చేతకాకపోతే ఎందుకు గ్యారెంటీలు ఇచ్చారని ఫైర్ అయ్యారు.
‘తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ఎలా పిలుస్తారు? ఆమె దయ దాక్షిణ్యాలతో రాష్ట్రం అవతరించలేదు. తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారు’ అని కిషన్ రెడ్డి తెలిపారు. ‘ఈ వేడుక పార్టీ కార్యక్రమమా? ప్రభుత్వ కార్యక్రమమా? సోనియా గాంధీ కనీసం మీ పార్టీ అధ్యక్షురాలు కూడా కాదు. ఆమె కేవలం వారసత్వ రాజకీయాలకు మాత్రమే నాయకురాలు’ అని అన్నారు.