- కాచిగూడలో ఓటేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- ఓటింగ్ అనంతరం మోదీ పేరు ప్రస్తావన
- ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించిన కిషన్ రెడ్డి
- సీఈవోకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
- కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలని వినతి
Congress complaint on Kishan Reddy cross the Election code :
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతకర వాతావరణంలో కొనసాగుతోంది. 17 పారర్లమెంట్ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ సమయం పెంచారు. ఇక ప్రధాన అభ్యర్థులంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమకు ఓటు ఉన్న ప్రాంతాలకు చేరుకుంటున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తన ఓటు హక్కును కాచికూడ డివిజన్ లోని దీక్ష మోడల్ స్కూల్ లో వినియోగించుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి కిషన్ రెడ్డి ఓటేశారు.
మోదీ పాలనలో దేశం సురక్షితం
అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి తన స్నేహితులు, మిత్రులతో కలిసి ఓటేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ డే అంటే హాలీడే కాదని.. ఓటేసి బాధ్యతను పూర్తి చేయాలని ప్రజలకు సూచించారు. కాగా, ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రధాని మోదీ పేరు ప్రస్తావించారు. ప్రధాని మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారు. ఈ కామెంట్లపై టీ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామవళికి విరుద్ధంగా కిషన్ రెడ్డి ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారని కంప్లైంట్ చేసింది. పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు, పార్టీల పేర్లు వంటివి ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఇలా మాట్లాడటం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించడమేనని చెప్పారు. కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలని సీఈవోను కోరింది.