– జోరుగా సాగుతున్న ప్రచారం
– కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురాంరెడ్డి
– కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ
– బీఆర్‌ఎస్ నుంచి నామా, బీజేపీ తరపున తాండ్ర వినోద్
– లేట్ అయినా లేటెస్ట్‌గా కాంగ్రెస్ ప్రచారం
– అన్నీ తానై సాగుతున్న మంత్రి పొంగులేటి
– ముగ్గురు మంత్రుల జిల్లాలో హస్తం మెజారిటీపై చర్చ
Khammam Lok Sabha constituency(telangana politics) : సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. ఈ క్రమంలోనే ఖమ్మం నియోజకవర్గంలోనూ ప్రచారం జోరుగా సాగుతోంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఖమ్మం, వైరా(ఎస్టీ), మధిర(ఎస్సీ), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్టీ), సత్తుపల్లి(ఎస్సీ), పాలేరు అసెంబ్లీ స్థానాలుండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో కొత్తగూడెంలో కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించగా అక్కడి నుంచి కూనంనేని సాంబశివరావు గెలిచారు. భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందగా, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్‌లో చేరటంతో ఈసారి ఇక్కడ కాంగ్రెస్ గెలుపు నల్లేరుమీద నడక అనే మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఈ స్థానంలో గెలుపొందగా, మళ్లీ ఈసారి ఆయనకే ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ తన అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని ప్రకటించగా, బీజేపీ తరపున తాండ్ర వినోద్ రావు బరిలో నిలిచారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో మొత్తం 16,31,039 మంది ఓటర్లున్నారు.
ముగ్గురూ ముగ్గురే…
అనేక సమీకరణాలను పరిశీలించిన తర్వాత రామసహాయం రఘురాంరెడ్డిని కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఈయన తండ్రి రామసహాయం సురేందర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు సేవలందించారు. పైగా ఈయన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వయానా వియ్యంకుడు కూడా. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి సొంతూరు కూసుమంచి మండలం చేగొమ్మ అయినా.. ఆయన తండ్రి సురేందర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం అంతా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగింది. ఈయన 4 పర్యాయాలు డోర్నకల్ ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు వరంగల్ ఎంపీగా పనిచేశారు. ఆయా సమయంలో తండ్రి తరపున రఘరాం రెడ్డి ప్రచార బాధ్యతలు నిర్వహించారు. తండ్రి తర్వాత ఆ స్థానాల బాధ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన రఘురాంరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డులో వైస్ ఛైర్మన్‌గా, హైదరాబాద్ రేస్ క్లబ్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఇక.. బీఆర్ఎస్ అభ్యర్థి, పారిశ్రామికవేత్త, రెండు పర్యాయాలు ఎంపీ… నామా నాగేశ్వరరావు రాజకీయంగా అందరికీ పరిచితులే. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎంబీఏ చదివి, 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం, తదితర వ్యాపారాల్లో ఉన్నారు. ఏకలవ్య ఫౌండేషన్ పేరుతో ఈయన పలు సేవాకార్యక్రమాలు చేస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పొంగులేటి
ఖమ్మం సీటులో కాంగ్రెస్అభ్యర్థి గెలుపు బాధ్యతను అక్కడి ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి తన సొంత వియ్యంకుడు కావటంతో మంత్రి దూకుడుగా జనంలోకి వెళుతున్నారు. నిన్నటివరకు ఈ టికెట్ ఆశించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలతో సమన్వయం చేసుకుంటూ, మరోవైపు కమ్యూనిస్టుల మద్దతునూ కూడగట్టుకుంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ వేసే రోజే బీఫామ్ వచ్చినా అతి తక్కువ సమయంలో ప్రణాళికా బద్ధంగా ప్రచారంలోకి దిగారు. ఇక్కడి ఆరు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే ఉండటం, ఏడో సీటు మిత్రపక్షానిది కావటంతో గెలుపు మీదనే గాక మెజారిటీ మీదా కాంగ్రెస్ మంచి ధీమాను ప్రదర్శిస్తోంది. 2014లో వైసీపీ తరపున బరిలో నిలిచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాతి రోజుల్లో బీఆర్ఎస్‌లో చేరారు. తర్వాత ఆయనను పార్టీ నిర్లక్ష్యం చేయటంతో గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరటమే గాక జిల్లాలోని పలు సీట్లను దగ్గరుండి గెలిపించారు. ఈయనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలు, కాంగ్రెస్ పథకాలు, ఇచ్చిన హామీలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదం చేయనున్నాయి.
భిన్న అంశాలతో విపక్షాల ప్రచారం
ఈసారి ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకే ఈ సీటును గులాబీ పార్టీ కేటాయించింది. గతంలో ఈ సీటునుంచి అనేక మంది పోటీపడాలని భావించారు. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం, కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ తర్వాత బీఆర్ఎస్ తరపున నాయకులెవరూ ఇక్కడ ఎంపీ బరిలో నిలిచేందుకు రాకపోవటంతోనే నామాకు ఆ సీటు ఇచ్చారనే వార్తలూ వచ్చాయి. పార్టీ తనను అభ్యర్థిగా ప్రకటించినా నామా ప్రచారం చేయటంలో చాలా ఆలస్యం చేశారు. జిల్లావ్యాప్తంగా పార్టీ తుడిచిపెట్టుకుపోవటంతో తన గెలుపు మీద ఎలాంటి అంచనాలు లేకున్నా, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ పోటీలో నిలిచారు. ఇక బీజేపీ ఇక్కడ కేవలం అయోధ్య రామాలయం, ఆర్టికల్ 370 వంటి అంశాలతో బాటు మోదీ చరిష్మాను ఈ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటోంది.