Key Announcement For Cotton Farmers Seeds Coming To That District Tomorrow: తెలంగాణలో పత్తి విత్తనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఎక్కడ చూసినా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గురువారం పత్తి విత్తనాల పంపిణీపై రాష్ట్రస్థాయి అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.నకిలీ విత్తనాల విక్రయితలపై నజర్ వేయాలని వీలైతే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, పోలీసు ఉన్నతధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో విత్తనాల రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా విత్తనాలు అందించే పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని సూచించారు. రైతుల నుంచి విత్తనాల కోసం డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సీడ్ కంపెనీ ప్రతినిధులతోనూ మంత్రి సమావేశం అయ్యారు.
ఇక ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవడంతో రైతులు పత్తి విత్తనాల కోసం గంటలకొద్ది పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అయితే విత్తనాల కొరత కారణంగా రైతన్నలు క్యూలైన్ కట్టారు. గత 15 రోజుల కిందట డీలర్ల వద్దకు విత్తనాలు రాగా విక్రయం కోసం పడిగాపులు కాస్తున్నారు. వచ్చేనెల మొదటి వారంలో రుతుపవనాలు రానుండడంతో పాటు వర్షాలు విస్తారంగా కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పటికే దుక్కి దున్ని భూములను సిద్ధం చేసుకున్న రైతులు, ఆయారకాల పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్నారు. మహిళా రైతులు సైతం ప్రత్యేక వరుసలో పత్తి గింజల కోసం నిలబడి గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
Also Read: హరితహారం కాదు, ఇందిర వనప్రభ..
ఆదిలాబాద్‌లో ఒక ఆధార్ కార్డుపై రెండు పత్తి బ్యాగులు ఇస్తుండటంతో జిల్లాలో విత్తనాల కొరత ఏర్పడింది. దీంతో క్యూలైన్లో నిలబడిన రైతులకు విత్తనాలు అందకపోవడంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులు అదుపు తప్పుతుండటంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాశీ 659 కంపెనీతో రేవంత్ సర్కార్ సంప్రదింపులు జరిపింది. జిల్లాకు అదనంగా 80 వేల ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు కంపెనీ అంగీకారం తెలిపింది. శనివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రాశీ 659 విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. అక్కడి నుంచి ప్రతి మండల హెడ్‌క్వార్టర్‌కు విత్తనాలను తరలించి నేరుగా రైతులకు పంపిణీ చేయనున్నారు.